
- శ్రీరాంసాగర్‌కు 3.50 లక్షల క్యూసెక్కుల వరద
- 39 గేట్లు ఎత్తి 2.78 లక్షల క్యూసెక్కులు విడుదల
- పంటలను ముంచెత్తుతున్న నది బ్యాక్ వాటర్
- ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాల్లో అప్రమత్తం
నిజామాబాద్/ఏటూరునాగారం/భద్రాచలం, వెలుగు : ఎగువ నుంచి గోదావరికి వచ్చే వరద ఆదివారం నెమ్మదించినా బాసర నుంచి భద్రాచలం వరకు నది ఉధృతంగానే ప్రవహిస్తోంది. బ్యాక్వాటర్ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతోంది. గంటగంటకు ఇన్‌ఫ్లో మారుతూనే ఉంది. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుండగా దిగువకు నీటి విడుదలవుతూనే ఉంది. నిజామాబాద్ జిల్లాలో నది ప్రవాహం కాస్త తగ్గింది. ములుగు జిల్లాలో గత మూడు రోజులుగా తొలి ప్రమాద హెచ్చరికలో మార్పు లేదు. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినా.. కొద్ది గంటల తర్వాత ఉపసంహరించారు. మొత్తంగా నది పరివాహక లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తోంది.
నిజామాబాద్ జిల్లాలో..
ఎగువ నుంచి శ్రీరాంసాగర్ లోని 3.25 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. 39 గేట్ల ద్వారా 2.78 లక్షల క్యూసెక్కులు దిగువకు పంపిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు 5.40 లక్షల క్యూసెక్కు ఉంది. ప్రాజెక్ట్ నుంచి 4.49 లక్షల క్యూసెక్కుల విడుదల చేశారు. నదిలో ప్రవాహం కాస్త తగ్గాక ఔట్ ఫ్లో 2.78 లక్షల క్యూసెక్కులకు కుదించారు. స్పిల్‌వే గేట్ల ద్వారా 2.51 లక్షలు, ఫ్లడ్‌గేట్ల ద్వారా18 వేలు, కాకతీయ కెనాల్‌కు 4,500, ఎస్కేప్గేట్ల నుంచి 3,500 క్యూసెక్కుల చొప్పున పంపిస్తున్నారు.
ప్రాజెక్టు 80.5 టీఎంసీల కెపాసిటీ కాగా.. సాయంత్రం 8 గంటలకు 70 టీఎంసీలు ఉంది. బోధన్సెగ్మెంట్లోని మందర్నా, హున్సా, ఖాజాపూర్, హంగర్గా, మిట్టాపూర్, అల్జాపూర్ గ్రామాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మునిగిపోయిన పంట నష్టాలు పెరుగుతున్నాయి. వదులుతున్న వరదతో సమీప గ్రామాల్లోని ప్రజలను ఆఫీసర్లు అప్రమత్తం చేశారు. వరద నీటి వైపు ప్రజలు వెళ్లకుండా ఆంక్షలు విధించారు.
ములుగు జిల్లాలో ..
ఏటూరు నాగారం వద్ద మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 15.700 మీటర్లుగా వరద తీవ్రత నమోదైంది. 15.820 మీటర్లు నమోదైతే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లోని నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మంత్రి సీతక్క ఆరా తీశారు. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లోని వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
భద్రాద్రి జిల్లాలో..
భద్రాచలం వద్ద గోదావరి నది 47.50 అడుగుల వద్ద స్థిరంగా ఉంది. ఉదయం 8.54 గంటల సమయంలో కలెక్టర్జితేశ్వి పాటిల్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. మధ్యాహ్నం 1.05 గంటలకు 47.90 అడుగులకు తగ్గగానే ఉపసంహరించారు. మరోవైపు జిల్లాలో 2 నుంచి 3 గంటల పాటు భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులను కలెక్టర్ అలర్ట్ చేశారు. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భద్రాచలం స్నానఘట్టాల వద్ద భక్తులు నదిలోకి దిగకుండా కరకట్టపై కంచెలు అమర్చారు.
లాంచీలు, పడవలు అందుబాటులో ఉంచారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, విద్యుత్‌అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీసు 08743-232444, 7981219425, కలెక్టర్ ఆఫీసులో 08744-241950, ఐటీడీఏ ఆఫీసులో 7995268352 కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండి అవసరమైతే కంట్రోల్ రూంకు, 100కు ఫోన్ చేయాలని ఎస్పీ రోహిత్‌రాజ్ విజ్ఞప్తి చేశారు.