
భర్తకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్న వివాహిత… ఆమె రెండో భర్తను చైతన్యపురి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. వివరాల్లోకి వెళితే..వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సీతారామపురం గ్రామానికి చెందిన కె.ప్రశాంత్ ఐదేళ్ల క్రితం రాధిక(25)ను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రశాంత్ ప్రైవేటు జాబ్ చేస్తుండగా..ఆర్థిక ఇబ్బందుల కారణంగా తానూ జాబ్ చేస్తానని రాధిక భర్తతో చెప్పింది. ఇందుకు ప్రశాంత్ ఒప్పుకోవడంతో రాధిక 6 నెలల క్రితం హైదరాబాద్ వచ్చింది.
చైతన్యపురి పరిధిలోని విజయపురి కాలనీలో హాస్టల్ లో ఉంటూ ఎల్బీనగర్ లోని హెచ్ డీఎఫ్సీ బ్యాంకులో జాబ్ చేస్తోంది. కొన్ని రోజులుగా రాధిక..ప్రశాంత్ తో ఫోన్ లో మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదు. దీంతో అనుమానం వచ్చిన ప్రశాంత్..రాధిక సోదరుడితో కలిసి ఆమె ఉండే హాస్టల్ కు వెళ్లాడు. అక్కడ రాధిక లేకపోవడంతో ఆమె పనిచేసే బ్యాంకు దగ్గరికి వెళ్లి ఆరాతీశారు. రాధిక పనిచేసే దగ్గర పరిచయమైన శశికుమార్ తో చనువుగా ఉంటుందని తెలుసుకున్న ప్రశాంత్ తన భార్య మిస్సింగ్ అంటూ చైతన్యపురి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాధిక మొబైల్ సిగ్నల్ ఆధారంగా పట్టుకుని విచారించగా.. తాను శశికుమార్ ను రెండో పెళ్ళి చేసుకున్నట్లు చెప్పింది. తనకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్న రాధికపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రశాంత్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాధిక,శశికుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.