- గ్రామాల్లో ప్రలోభాలతో ఓటర్లకు ఎర
- సత్తా చాటేందుకు పార్టీల కసరత్తు
కరీంనగర్, వెలుగు: ఈనెల 14న రెండో దశలో ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెరపడింది. సర్పంచ్, వార్డు అభ్యర్థులు క్యాంపెయిన్‌కు ముగింపు పలికి చాలా చోట్ల ప్రలోభాలకు తెరలేపారు. మొదటి విడతలో పోలీసులు, అధికారులు ఎంత కట్టడి చేసినా చాలాచోట్ల డబ్బు, మద్యం పంపిణీ జరిగినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు జరిగే 418 గ్రామాల్లో మొత్తం 1,726 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో జగిత్యాల జిల్లాలో 10, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 11, కరీంనగర్ జిల్లాల్లో 2 జీపీల్లో కలిపి 23 మంది సర్పంచ్ లు ఏకగ్రీవమయ్యారు.
కరీంనగర్ జిల్లాలో మానకొండూరు, తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటి పరిధిలో 113 గ్రామాలు ఉండగా.. గన్నేరువరం మండలం పీచుపల్లి సర్పంచ్‌గా సామా రాజిరెడ్డి, గోపాల్‌పూర్ సర్పంచ్‌గా ఆకుల కవిత ఏకగ్రీవమయ్యారు. ఈ రెండు గ్రామాల్లో వార్డు మెంబర్లంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 111 గ్రామాల్లో 438 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1,046 వార్డు స్థానాల్లో 2,473 మంది పోటీపడుతున్నారు.
రాజన్న సిరిసిల్ల, వెలుగు: జిల్లాలో బోయినిపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటి పరిధిలో 88 సర్పంచ్, 758 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 11 జీపీలు, 182 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 77 జీపీల్లో 279 మంది సర్పంచ్ అభ్యర్థులు, 576 వార్డుల్లో 1,342 వార్డు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో మొత్తం ఏడు మండలాల్లో 144 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. ఈ 144 సర్పంచ్ స్థానాలకు 646 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీర్పూర్ మండలం 17 సర్పంచ్ స్థానాల్లో 57 మంది, జగిత్యాల మండలంలో 5 స్థానాలకు 24 మంది, జగిత్యాల రూరల్ 29 స్థానాల్లో 121 మంది, కొడిమ్యాలలో 22 సర్పంచ్ స్థానాల్లో 109 మంది, మల్యాల మండలంలో 19 జీపీల్లో 120 మంది, రాయికల్ మండలంలో 32 స్థానాల్లో 140, సారంగపూర్ లోని 18 స్థానాల్లో 83 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో రెండో దశలో అంతర్గాం, ధర్మారం, జూలపల్లి, పాలకుర్తి మండలాల్లోని 73 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 73 సర్పంచ్ స్థానాల్లో 488 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అంతర్గాం మండలం 15 సర్పంచ్ స్థానాల్లో 102 మంది, ధర్మారం మండలంలో 29 జీపీల్లో 185 మంది, జూలపల్లిలోని 13 స్థానాల్లో 82 మంది, పాలకుర్తి మండలంలో 16 జీపీల్లో 119 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

