- ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 564 జీపీలు, 4,937 వార్డులు
- 56 జీపీల్లో సర్పంచులు, 917 వార్డుల్లో సభ్యులు ఏకగ్రీవం
- 6 జిల్లాల్లో 80 శాతం దాటిన పోలింగ్
వరంగల్, వెలుగు : ఓరుగల్లులో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓటర్లు పోలింగ్‍సెంటర్లలో పొటెత్తారు. మొత్తంగా 564 జీపీలు, 4,937 వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 56 జీపీల్లో సర్పంచులు, 917 వార్డుల్లో సభ్యులు ఏకగ్రీవమయ్యారు. దీంతో 508 జీపీలకు 4,020 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించారు.
ఆదివారం సెలవు దినం కావడంతో ఓటర్లు భారీగా తరలివచ్చారు. దీంతో ఉమ్మడి ఆరు జిల్లాల్లో ప్రతిచోటా 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. గెలిచిన అభ్యర్థులు సంబురాలు చేసుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో 7,33,323 మంది ఓటర్లు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7,33,323 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం 4,638 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా 5,686 మంది పీవోలు, 8,191 మంది ఓపీఓలు విధుల్లో ఉన్నారు. కమిషనరేట్‍తో పాటు రూరల్ పరిధిలోని 3 జిల్లాల నుంచి మొత్తంగా 5,500 మంది పోలీస్ సిబ్బంది ఎలక్షన్ బందోబస్తులో పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వివరాలు..
జిల్లా మొత్తం ఓట్లు పోలైన ఓట్లు ఓటింగ్‍శాతం
వరంగల్ 1,36,191 1,20,001 88.11
హనుమకొండ 1,25,735 1,09,703 87.25
జనగామ 1,07,067 94,776 88.52
భూపాలపల్లి 82,728 70,526 85.25
ములుగు 54,944 45,565 82.93
మహబూబాబాద్ 1,98,785 1,69,071 85.05
