హనుమకొండ, వెలుగు: జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాల్లో ఆదివారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మొదటి విడతలో మూడు మండలాల్లోని 69 జీపీల్లో సర్పంచ్ స్థానాలకు 496 నామినేషన్లు రాగా, 658 వార్డు స్థానాలకు 1,747 నామినేషన్లు దాఖలయ్యాయి.
రెండో విడతలో ధర్మసాగర్, హసన్ పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లోని 73 జీపీలు, 694 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం మొదటిరోజు 73 సర్పంచ్ స్థానాలకు 51, వార్డు మెంబర్ స్థానాలకు 44 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ పరిశీలించారు. హసన్ పర్తి మండలంలోని సీతంపేట, నాగారం క్లస్టర్ పంచాయతీ ఆఫీసుల్లో నామినేషన్ల స్వీకరణను పరిశీలించి, ఎలక్షన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
జయశంకర్భూపాలపల్లి: జిల్లాలోని చిట్యాల, టేకుమట్ల, భూపాలపల్లి, పలిమెల మండలాల్లోని 85 సర్పంచ్, 694వార్డులకు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. చిట్యాల మండలంలో సర్పంచ్ స్థానాలకు 20 నామినేషన్లు, వార్డు సభ్యులకు 18, టేకుమట్లలో సర్పంచ్‌కు 16, వార్డు సభ్యులకు 4, పలిమెలలో సర్పంచ్ కు3, వార్డు సభ్యులకు 4 నామినేషన్లు దాఖలయ్యాయి.
భూపాలపల్లి మండలంలో నామినేషన్లు దాఖలు కాలేదు.
ములుగు: ములుగు జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో 48 సర్పంచ్ స్థానాలకు గాను 294 మంది నామినేషన్లు రాగా, 420 వార్డులకు 969 మంది నామినేషన్లు వేశారు. గోవిందరావుపేట మండలం కోటగడ్డ సర్పంచ్ స్థానానికి సింగిల్ నామినేషన్ దాఖలైంది. కోటగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని మూడు వార్డులకు నామినేషన్లు పడలేదు. రంగాపూర్‌లో ఒక వార్డుకు నామినేషన్ వేయలేదు.
5 సర్పంచ్ స్థానాలకు సింగిల్ నామినేషన్..
జనగామ: జనగామ జిల్లాలో తొలి విడతలో ఎన్నికలు జరిగే 5 సర్పంచ్ స్థానాలకు, 185 వార్డులకు సింగిల్ నామినేషన్ దాఖలయ్యాయి. రఘునాథపల్లి, లింగాల ఘన్పూర్, స్టేషన్ ఘన్పూర్, చిల్పూరు, జఫర్ఘడ్ మండలాల పరిధిలోని 110 సర్పంచ్ స్థానాలకు 788 మంది నామినేషన్లు వేశారు.
1,024 వార్డులకు 2,398 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం జిట్టెగూడెం, రఘునాథపల్లి మండలం రామన్నగూడెం, అయ్యవారిగూడెం, వెల్ది, సోమయ్యకుంట తండాలో సర్పంచ్ స్థానాలకు సింగిల్ నామినేషన్ దాఖలైంది.
