V6 News

రేపే (డిసెంబర్ 14) రెండో విడత పోలింగ్.. 4,332 పంచాయతీల్లో ఎన్నికలు

రేపే (డిసెంబర్ 14)  రెండో విడత పోలింగ్.. 	4,332 పంచాయతీల్లో ఎన్నికలు
  • ముగిసిన ప్రచారం
  • అభ్యర్థుల సైలెంట్​ ఆపరేషన్ ​షురూ 
  • ఇవాళ పోలింగ్ కేంద్రాలకు 
  • ఎన్నికల సామగ్రి తరలింపు

హైదరాబాద్, వెలుగు: మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. విజేతలెవరో తేలిపోయింది. ఉప సర్పంచుల ఎన్నిక కూడా పూర్తయింది. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. 4,332 పంచాయతీల్లో పోలింగ్​జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారంతో రెండో విడత ఎన్నికల ప్రచారానికి బ్రేక్​ పడింది. ఇన్ని రోజులు ఊరూరా మార్మోగిన మైకులు బంద్ అయ్యాయి. ఇప్పటిదాకా విస్తృత ప్రచారం చేసిన అభ్యర్థులు.. సైలెంట్ ఆపరేషన్ షురూ చేశారు. 

పోలింగ్‌‌‌‌‌‌‌‌కు ఇంకా కొన్ని గంటలే సమయం ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. వార్డులు, కాలనీల వారీగా డబ్బులు, మద్యం పంపిణీ ముమ్మరం చేశారు. రాత్రివేళ మందు, విందు రాజకీయాలు జోరందుకున్నాయి. ప్రత్యర్థులు ఎంత ఇస్తే.. అంతకు మించి తాము ఇస్తామంటూ పోటాపోటీగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. కాగా, రెండో విడత ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అందజేయనున్నారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర ఎన్నికల సామగ్రితో సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు సాయంత్రం వరకు తరలివెళ్లనున్నారు. 

415 గ్రామాలు ఏకగ్రీవం.. 

రెండో విడతలో 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 5 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 415 గ్రామాల్లో సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు ఏకగ్రీవమయ్యారు. దీంతో మిగిలిన 3,906 సర్పంచ్ స్థానాలకు 13,128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక 38,322 వార్డులకు గాను 107 వార్డుల్లో ఎవరూ నామినేషన్లు వేయలేదు. 8,304 వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 29,903 వార్డులకు 78,158 మంది పోటీలో ఉన్నారు.  

వలస వెళ్లిన ఓటర్లకు ఫోన్లు..  

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న తమ గ్రామస్తులకు ఫోన్లు చేసి వచ్చి ఓటేసి పోవాల ని సర్పంచ్ అభ్యర్థులు బతిమిలాడుతున్నారు. తొలి విడత పోలింగ్​ శాతంపై వలస ఓటర్ల ప్రభావం పడింది. దీంతో రెండో విడత బరిలో నిలిచిన అభ్యర్థులు వలస ఓటర్లను గ్రామానికి రప్పించి ఓట్లు వేయించుకునేలా ప్లాన్​ చేశారు. బస్సు చార్జీలతో పాటు ఓటుకు ఇంత చొప్పున ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో పంపిస్తున్నా రు. కొన్నిచోట్ల వలస ఓటర్లను తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా వాహనాలను సైతం పంపించారు.