మొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా పోలింగ్

మొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా పోలింగ్
  • నేడే (డిసెంబర్ 14) రెండో విడత పోలింగ్​ 
  • 3,911 పంచాయతీల్లో ఎన్నికలు
  • ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా పోలింగ్ 
  • మధ్యాహ్నం 2 తర్వాత కౌంటింగ్, ఫలితాల వెల్లడి
  • ఏర్పాట్లు పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం  
  • ఇప్పటికే 415 సర్పంచ్, 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం (డిసెంబర్ 14) మొదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ కాగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పల్లె ఓటర్లు పోలింగ్ బూత్ లకు క్యూ కట్టారు. సెకండ్ ఫేజ్ లో 193 మండలాల్లోని 3,911 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం 38,350 పోలింగ్ ​కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని వసతులు కల్పించారు. 

కొన్నింటిని మోడల్​ పోలింగ్ స్టేషన్లుగా తీర్చిదిద్దారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్​ ప్రక్రియను చేపట్టి.. విజేతలను ప్రకటించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్​సెంటర్ల నుంచి ఎన్నికల సిబ్బంది శనివారమే పోలింగ్​సామగ్రి తీసుకుని తమకు కేటాయించిన గ్రామాలకు తరలివెళ్లారు. ఓటింగ్​కు గంట ముందు కేంద్రాల్లో మాక్​ పోలింగ్​ నిర్వహించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు.  

415 సర్పంచ్​ స్థానాలు ఏకగ్రీవం.. 

రెండో విడతలో మొత్తం 4,333 పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వగా.. 5  పంచాయతీలు, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 415 పంచాయతీల్లో సర్పంచ్, 8,307 వార్డు  స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల 2 పంచాయతీలు, 18 వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో మిగిలిన 3,911 సర్పంచ్,  29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది, వార్డుమెంబర్ల కోసం 71,071 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.  

38,350 పోలింగ్​ కేంద్రాలు

సెకండ్​ ఫేజ్ ఎన్నికల కోసం 38,350 పోలింగ్​కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు మూడ్రోజుల ముందు నుంచే బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు.  అందని వారికి పోలింగ్ రోజు అక్కడే అందించనున్నారు. అభ్యర్థులు లేదా పార్టీలు ఇచ్చే స్లిప్పులు సాదా తెల్ల కాగితంపై మాత్రమే ఉండాలి. వాటిపై ఎలాంటి గుర్తులు, అభ్యర్థి ఫొటోలు, పేర్లు, పార్టీ పేర్లు ఉండొద్దని ఎస్ఈసీ స్పష్టం చేసింది.   

3,769 పోలింగ్ కేంద్రాల్లో వెబ్​ కాస్టింగ్​  

రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల ఎన్నికల కోసం 2,489 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. రెండో విడతలో 4,593 మంది ఆర్వోలు, 30,661 మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకోనున్నారు. 3,769  పోలింగ్ ​కేంద్రాల్లో వెబ్​కాస్టింగ్​ నిర్వహిస్తున్నారు. మొత్తం 46,026 బ్యాలట్ ​బాక్సులను అందుబాటులో ఉంచారు. కాగా, ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) కఠినంగా అమలు చేస్తున్నారు. 

ఇప్పటివరకు రూ.8.59 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేశారు. రూ.2.02 కోట్ల నగదు, రూ.3.46 కోట్ల విలువైన మద్యం, రూ.2.28 కోట్ల డ్రగ్స్, నార్కోటిక్స్, రూ.12 లక్షలు, ఇతర రూ.69 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.. మొత్తం 3,675 ఎఫ్ఐఆర్ లు నమోదు కాగా.. 33,262 మందిని బైండోవర్ చేశారు. 912 లైసెన్స్డ్​ రివాల్వర్లు స్వాధీనం చేసుకున్నారు. 

పంచాయతీ ఎన్నికల్లో సాంకేతికత..

ఓటర్ల సౌకర్యార్థం ఎన్నికల సంఘం టీఈ– పోల్​ (Te-poll) అనే ఆండ్రాయిడ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఓటర్లు తమ స్లిప్పులను డౌన్లోడ్ చేసుకోవడంతోపాటు పోలింగ్ కేంద్రం అడ్రస్ తెలుసుకోవచ్చు. ఎలాంటి ఫిర్యాదులకైనా టోల్ ఫ్రీ నంబర్ 92400 21456ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఓటర్లు నిర్భయంగా, బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. 

మహిళా ఓటర్లదే హవా

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. వీరి ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నాయి. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ దఫాలో మొత్తం 57,22,665 మంది ఓటర్లు ఓటింగ్​లో పాల్గొననున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 29,26,306, పురుషు ఓటర్లు 27,96,006 మంది ఉన్నారు. 1,26,659 మంది మహిళల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇతరులు 153 మంది ఉన్నారు. ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్‌, పట్టాదార్ పాస్‌బుక్‌, ఉపాధి హామీ జాబ్ కార్డు.. ఇలా ఎస్ఈసీ సూచించిన18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటర్లు ఓటు వేయవచ్చు. 

రెండో విడత పల్లెపోరు ఇలా.. 

  • ఎన్నికల నోటిఫికేషన్​ ఇచ్చిన 
  • పంచాయతీలు:  4,331 
  • నామినేషన్లు దాఖలు కానివి: 5
  • ఏకగ్రీవమైనవి: 415
  • పోలింగ్ జరిగే పంచాయతీలు: 3,911
  • నోటిఫికేషన్​ ఇచ్చిన వార్డులు : 38,332 
  • నామినేషన్లు రానివి / చెల్లనివి: 111
  • ఏకగ్రీవమైనవి: 8,308
  • పోలింగ్ జరిగే వార్డులు: 29,913