వెలుగు, నెట్వర్క్: రెండో విడత ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం తెరపడింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో మైకులు, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వైన్స్ బంద్ అయ్యాయి. చివరి అవకాశంగా బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెర లేపారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే మందు, చికెన్, చీరల పంపిణీ పూర్తి చేయగా, శనివారం రాత్రి డబ్బులు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీని బట్టి ఒక్కో ఓటరుకు రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు పంపిణీ చేసేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రెండవ విడత ఎన్నికల్లోనూ మద్యం, చికెన్, డబ్బుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామాలపై పట్టు సాధించేందుకు పోటీలో ఉన్నవారు ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు. ఆదివారం ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందించడంతో పాటు బందోబస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు.
– జోగులాంబగద్వాల జిల్లాలోని మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో 74 జీపీలు ఉండగా, 18 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 56 సర్పంచ్ స్థానాలకు, 474 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం 653 మంది పీవోలు, 942 మంది ఏపీవోలను నియమించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని నాగర్కర్నూల్, బిజినేపల్లి, తిమ్మాజీపేట, కొల్లాపూర్, కోడేరు, పెద్దకొత్తపల్లి,పెంట్లవెల్లి మండలాల్లో 151 గ్రామపంచాయతీలు,1,412 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. 2,53,749 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రెండవ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేరు మండలాల్లోని పలు గ్రామ పంచాయతీల్లో ప్రచారం చేసిన మంత్రి కాంగ్రెస్ బలపరిచిన వారిని గెలిపిస్తే గ్రామాల అభివృద్దికి సహకరిస్తానని మాటిచ్చారు.
మహబూబ్నగర్ జిల్లాలోని హన్వాడ, కౌకుంట్ల, దేవకరకద్ర, కోయిల్కొండ, చిన్నచింతకుంట, మిడ్జిల్ మండలాల్లోని 151 గ్రామ పంచాయతీలు ఉండగా, 9 జీపీల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగిలిన142 సర్పంచ్ స్థానాలకు 475 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1,334 వార్డులకు గాను 267 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1,065 వార్డుల్లో ఎన్నికలు జరగనుండగా, 2,871 మంది పోటీ పడుతున్నారు.
నారాయణపేట జిల్లాలోని నారాయణపేట, మరికల్, ధన్వాడ, దామరగిద్ద మండలాల్లోని 95 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. వీటిలో 10 జీపీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 95 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి.
సర్పంచ్ స్థానాలకు 268 మంది పోటీ పడుతున్నారు. 900 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 224 వార్డులు ఏకగ్రీవమయ్యాయి, మిగిలిన 672 వార్డులకు 1,755 మంది క్యాండిడేట్లు పోటీ పడుతున్నారు.వనపర్తి జిల్లాలోని 94 సర్పంచ్, 850 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అమరచింత మండలంలో 14, ఆత్మకూరులో 13, కొత్తకోటలో 24, మదనాపురంలో 17, వనపర్తిలో 26 గ్రామాల్లో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. 1,24,281 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

