- ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం
- ప్రలోభాలకు తెరలేపిన కొందరు అభ్యర్థులు
- వలస ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మరికొందరు
- రేపు ఉమ్మడి జిల్లాలోని 508 జీపీల్లో ఎన్నికలు
హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడతల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ కానుంది. సెకండ్ ఫేజ్ ఎలక్షన్ కోసం ఇన్నిరోజులు తమకు కేటాయించిన గుర్తులతో ప్రచారం చేసుకున్న అభ్యర్థులు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ప్రచార గడువు ముగియగానే ప్రలోభాలకు తెర లేపారు. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వలస ఓటర్లను గ్రామానికి రప్పించే పనిలో పడ్డారు. ఇదిలాఉంటే రెండో విడత ఎన్నికల నిర్వహణకు ఆఫీసర్లు సమాయత్తమవుతున్నారు.
508 జీపీలు, 4020 వార్డులకు ఎన్నికలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండో విడతలో 27 మండలాల్లోని 564 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, అందులో 56 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగతా 508 జీపీలు ఎన్నికలు నిర్వహించనుండగా, మొత్తంగా 1,686 మంది సర్పంచ్ స్థానాలకు పోటీ పడుతున్నారు. ఇక 4,937 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, అందులో 917 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగతా 4020 వార్డులకు ఆఫీసర్లు ఎలక్షన్స్ జరగనుండగా, 9,884 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
వలస ఓటర్లకు రప్పించేపనిలో..
గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు చాలామందే ఉన్నారు. కొంతమంది పెండ్లి అయినా ఓటు మార్చుకోని వాళ్లూ ఉన్నారు. దీంతో దూర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లకు అభ్యర్థులు ఫోన్లు చేసి మరీ రప్పించే పనిలో పడ్డారు. ఎక్కువ మంది వలస ఓటర్లు ఉంటే వారికి ప్రత్యేకంగా వాహనాలను కూడా సమకూర్చేందుకు రెడీ అయ్యారు. బస్సులు, ఇతర వాహనాల్లో వచ్చేవారికి రాను, పోను ఛార్జీలు కూడా చెల్లిస్తామంటూ వలస ఓటర్లను రప్పించే ప్రయత్నాలు
చేస్తున్నారు.
జోరుగా ప్రలోభాలు..
రెండో విడత ప్రచారానికి గడువు ముగిసిపోగా గ్రామాల్లో కొంతమంది అభ్యర్థులు ప్రలోభాలకు తెర లేపారు. ఫస్ట్ విడతలో కొన్నిచోట్ల సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు రూ.500 నుంచి రూ.3 వేల వరకు పంచారు. కొన్నిచోట్ల ఇంటింటికీ చికెన్, క్వార్టర్ సీసాలు కూడా పంపిణీ చేశారు. రెండో విడత జీపీల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నారు. మేజర్ పంచాయతీలతో పాటు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీపీల్లో ఓటుకు డిమాండ్ ను బట్టి రేటు కట్టించేందుకు రెడీ అయ్యారు.
రెడీ అవుతున్న ఆఫీసర్లు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 27 మండలాల్లో ఆదివారం సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ జరగనుండగా, ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు డీపీవోలతో పాటు సెకండ్ విడత ఎన్నికలు జరిగే మండలాల ఎంపీడీవోలతో సమావేశాలు నిర్వహించారు. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లలో శనివారం పోలింగ్ కేంద్రాల వారీగా సామగ్రిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
చివరి రోజు ప్రచార హోరు..
నల్లబెల్లి/ తొర్రూరు/ బచ్చన్నపేట/ జనగామ అర్బన్/ వర్ధన్నపేట (ఐనవోలు) : గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం శుక్రవారం జోరుగా సాగింది. రెండో విడత ప్రచారం చివరి రోజు కావడంతో ఉదయం నుంచే గ్రామాల్లో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో జనంతో కలిసి ప్రచారం చేశారు. పలు పార్టీల తరఫున మద్దతు తెలుపుతూ ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లోని ఆయా గ్రామాల్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్‌రెడ్డి, ఐనవోలు మండలంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు , టెస్కాబ్ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు పాల్గొని ప్రచారం చేశారు.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థుల తరఫున ప్రచారంలో మాట్లాడారు. జనగామ మండలం శామీర్‌పేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్ ప్రచారం చేశారు. తొర్రూరు మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రచారంలో పాల్గొన్నారు.

