నస్పూర్, వెలుగు: బ్యాంక్ లింకేజీలో గత మూడేండ్లుగా మంచిర్యాల జిల్లా అవార్డులు అందుకుంటోందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ తెలిపారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం దక్కించుకుందన్నారు. 2023–24 సంవత్సరానికి గానూ 5,977 సంఘాలకు రూ.358.58 కోట్ల బ్యాంక్ లింకేజీలు లక్ష్యంగా నిర్ధేశించిగా 6,606 సంఘాలకు రూ.420.18 కోట్లు 59,454 మంది సభ్యులకు బ్యాంక్ లింకేజీ రుణాలు ఇప్పించినట్లు చెప్పారు.
హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీ ఇన్ స్టిట్యూట్లో శనివారం జరిగిన వార్షిక ప్రణాళిక కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శాఖ మంత్రి సీతక్క, పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి చేతుల మీదుగా ఆవార్డు తీసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, డీపీఎం (ఎఫ్ఐ) స్వర్ణలత, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రాజేశ్వరి, కార్యదర్శి అనిత తదితరులు పాల్గొన్నారు.