రెండో విడత సర్పంచ్ స్థానాలకు 28,278నామినేషన్లు..ఒక్కో పంచాయతీకి ఆరు నుంచి ఏడుగురి పోటీ

రెండో విడత సర్పంచ్ స్థానాలకు 28,278నామినేషన్లు..ఒక్కో పంచాయతీకి  ఆరు నుంచి ఏడుగురి పోటీ
  • వార్డులకు 93,595 నామినేషన్లు 
  • అత్యధిక నామినేషన్లతో నల్గొండ జిల్లా టాప్
  • ఉపసంహరణకు 5 దాకా గడువు
  • 14న పోలింగ్.. అదేరోజు ఫలితాలు 

హైదరాబాద్, వెలుగు: రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ముగిశాయి.  సర్పంచ్ పదవుల కోసం భారీగా పోటీ పడ్డారు. ఒక్కో స్థానానికి సగటున ఆరుగురి నుంచి ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా నల్గొండ, అత్యల్పంగా ములుగు జిల్లాలో నామినేషన్లు వేశారు. 

ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా.. సర్పంచ్ స్థానాలకు 28,278 నామినేషన్లు, 38,342 వార్డులకు 93,595 నామినేషన్లు వచ్చాయి. నల్గొండ జిల్లాలో సర్పంచ్, వార్డుస్థానాల కోసం భారీగా నామినేషన్లు పడ్డాయి. ఈ జిల్లాలో 282 పంచాయతీలకు అత్యధికంగా 2,116 నామినేషన్లు రాగా.. 2,418 వార్డులకు రికార్డు స్థాయిలో 6,120 నామినేషన్లు దాఖలయ్యాయి. 

సంగారెడ్డి జిల్లాలో 243 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాల​ కోసం 1,444 నామినేషన్లు, సూర్యాపేటలో 181 పంచాయతీలకు 1,447 నామినేషన్లు దాఖలయ్యాయి. -రెండో విడతలో 6 జిల్లాలో వార్డులకు 4 వేలపైచిలుకు నామినేషన్లు దాఖలయ్యాయి. 

ఏజెన్సీలో తగ్గిన జోరు

మైదాన ప్రాంతాలతో పోలిస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో పోటీ తక్కువగానే ఉంది. ములుగు జిల్లాలో అత్యల్పంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ 52 పంచాయతీలకు 288 మంది సర్పంచ్​ స్థానాలకు నామినేషన్లు వేశారు. 

ఆదిలాబాద్ జిల్లాలో 156 పంచాయతీలకు 851 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ములుగు జిల్లాల్లో సగటున ఒక్కో సర్పంచ్​ స్థానానికి 5 నుంచి 6 నామినేషన్లు వచ్చాయి. గద్వాల, హనుమకొండ జిల్లాల్లో కూడా నామినేషన్ల సంఖ్య తక్కువగానే ఉంది.

14న పోలింగ్.. అదేరోజు ఫలితాలు 

నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో గురువారం వాటిపై అభ్యంతరాలను తీసుకోనున్నారు. 5న అప్పీళ్లను పరిష్కరిస్తారు. 6న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అదేరోజు బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులను సైతం కేటాయించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 14న పోలింగ్​ నిర్వహించనుండగా.. అదేరోజు విజేతలను ప్రకటించనున్నారు.

హోరాహోరీగా ప్రచారం

రెండో విడతలో ఒక్కో ఊరికి సగటున ఆరు నుంచి ఏడుగురు పోటీ పడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎంతమంది బరిలో నిలుస్తారనేది క్లారిటీ రానున్నది. పోటీలో నిలబడిన అభ్యర్థులు ప్రచారాన్ని షురూ చేశారు. ఇంటింటికెళ్లి ఓట్లు అభ్యర్థించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే తమకు ఓటెయ్యాలని వాట్సాప్​, ఫేస్​ బుక్, ఇన్​స్టా   తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు.