లక్ష ఉద్యోగాలు టార్గెట్..మరో ఆరు నెలల్లో భర్తీకి సర్కార్ ప్రణాళికలు

లక్ష ఉద్యోగాలు టార్గెట్..మరో ఆరు నెలల్లో భర్తీకి సర్కార్ ప్రణాళికలు
  • ఇప్పటికే 61,379 పోస్టుల భర్తీ.. తుది దశలో మరో8,632 పోస్టులు
  • యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ ప్రక్షాళన
  • సక్సెస్​ఫుల్​గా గ్రూప్స్​​ సహా అన్ని పరీక్షల నిర్వహణ
  • 13 సార్లు ‘కొలువుల పండుగ’ నిర్వహించిన సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో రికార్డు స్థాయిలో 61,379 కొలువులను ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 8,632 ఉద్యోగ నియామకాలు తుది దశలో ఉండగా, రాబోయే 6 నెలల్లో లక్ష ఉద్యోగాల మైలురాయిని చేరేలా రేవంత్ రెడ్డి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తున్నది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డినే 13 సార్లు ‘కొలువుల పండుగ’ నిర్వహించి నియామక పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన నియామకాలపై ఓ నివేదిక విడుదల చేసింది.

టీజీపీఎస్సీ ప్రక్షాళన.. సక్సెస్ ఫుల్​గా గ్రూప్స్​

అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి టీజీపీఎస్సీలో పలు మార్పుచేర్పులు చేపట్టి, యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళించారు. గతంలో పేపర్ లీకేజీలతో గందరగోళంగా మారిన గ్రూప్-1ను రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, 562 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చి విజయవంతంగా రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తిచేసింది. సెప్టెంబర్ 27న  హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికగా గ్రూప్ 1 అభ్యర్థులకు, అక్టోబర్​18న 782 మంది గ్రూప్​2 అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలు అందజేశారు. 

ప్రజా ప్రభుత్వం తొలి విజయోత్సవాల సందర్భంగా పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం వేదికపై 8,143 మంది అభ్యర్థులకు సీఎం నియామకపత్రాలు అందజేశారు. టీజీపీఎస్సీ గ్రూప్ 3 సర్వీస్ పోస్టుల కోసం మూడేండ్ల కింద విడుదల చేసిన నోటిఫికేషన్.. కాంగ్రెస్​ ప్రభుత్వంలోనే గాడిన పడింది. 1,365 పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్ 17, 18వ తేదీల్లో పరీక్షలు జరిగాయి.

 ఈ ఏడాది మార్చిలో ఫలితాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. త్వరలోనే వీరికి పోస్టింగులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇలా టీజీపీఎస్సీ ద్వారానే రెండేండ్లలో మొత్తం 15,780 ఉద్యోగాలను భర్తీ చేశారు. వయో పరిమితి సడలింపుతో నిరుద్యోగులకు ప్రభుత్వం ఊరట కల్పించినట్లయింది.

మెగా డీఎస్సీ.. పోలీస్ కొలువుల జాతర

గత పదేండ్లుగా నిర్లక్ష్యానికి గురైన విద్యావ్యవస్థలోనూ ఖాళీల భర్తీకి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. తొలి ఏడాదిలోనే మెగా డీఎస్సీ నిర్వహించి  11,062 పోస్టులు భర్తీ చేసింది. నిరుడు జులైలో పరీక్షలు నిర్వహించి సెప్టెంబర్ 30న ఫలితాలను వెల్లడించింది. వీరిలో 10,006 మంది ఉద్యోగాల్లో చేరారు. పలు గురుకుల సొసైటీల పరిధిలో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులన్నీ కలిపి.. కొత్త ప్రభుత్వం 8,400 మందికి నియామకపత్రాలు అందజేసింది. కొత్తగా సర్కారు స్కూళ్లలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ క్లాసుల బోధనకు తాత్కాలిక పద్ధతిన నియామకాలు చేపట్టింది. ఇక పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అడ్డంకులన్నీ తొలగించి 16,067 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు కల్పించింది. 

వైద్యారోగ్య శాఖలోనూ..

మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ బోర్డు ద్వారా ప్రభుత్వం 8,666 పోస్టులను భర్తీ చేసింది. ఇందులో సుమారు 7వేల స్టాఫ్ నర్స్ పోస్టులతో పాటు 1,260 ల్యాబ్ టెక్నీషియన్లు, 422 డాక్టర్ల నియామకాలు ఉన్నాయి. మరో 7,267 పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ రిక్రూట్​మెంట్ పూర్తయ్యే చాన్స్ ఉంది.