భారతీయ ప్రజాస్వామ్యానికి గ్రామం అత్యంత బలమైన పునాది. గ్రామం బలపడితేనే దేశం బలపడుతుంది. గ్రామ అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం. ఈ గ్రామ పాలనలో అత్యంత ప్రధానమైనవి గ్రామపంచాయతీ ఎన్నికలు. చట్టసభల ఎన్నికల కంటే సాధారణ ఎన్నికలు అనుకున్నా, నిజంగా చూసుకుంటే మన దైనందిన జీవితంపై ప్రతిరోజూ ప్రభావం చూపేది గ్రామస్థాయి పరిపాలనే. గ్రామాల అభివృద్ధిలో ప్రథమ పౌరుడు సర్పంచ్. అతడితోపాటు వార్డు సభ్యులది క్రియాశీలక పాత్ర. వారు సమర్థంగా వ్యవహరిస్తే. ప్రజలు ఆదరించి, పదవులను కట్టబెడతారు.
భారత రాజ్యాంగంలోని మూడంచెల వ్యవస్థలో ప్రజలకు దగ్గరగా పనిచేస్తున్న సంస్థలు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు. గ్రామపంచాయతీలను బలోపేతం చేయడానికి కేంద్రం 1992లో రాజ్యాంగ సవరణ చేసి గ్రామపంచాయతీలకు, మున్సిపాలిటీలకు రాజ్యాంగ భద్రత కల్పించింది. రాజ్యాంగం అధికరణ 243జి గ్రామపంచాయతీలను బలోపేతం చేయాలని ఆదేశాలు ఇచ్చింది. 11వ షెడ్యూల్లో చెప్పినవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు 29 శాఖలకు సంబంధించిన పనులు గ్రామపంచాయతీలకు బదలాయింపులు చేయాలని చెప్పడం జరిగింది.
ఈక్రమంలో ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరపాలి. పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభలకు క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతాయో అలాగే పంచాయతీలకు, మున్సిపాలిటీలకు కూడా వాటి పదవీకాలం ముగిసే ముందే ఎన్నికలు జరపాలి. కొత్త పాలకవర్గం పాతవారి పదవీకాలం ముగిసేనాటికి సిద్ధంగా ఉండాలి.
తెలంగాణలో 20 నెలలు ఆలస్యంగా ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు కాల పరిమితి 2 ఫిబ్రవరి, 2024 తో ముగిసినది. హైకోర్టు ఆదేశాల మేరకు... 20 నెలలు ఆలస్యంగా ఈ నెల 11, 14, 17 తేదీలలో రాష్ట్రంలో12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచులకు, వార్డు సభ్యులకు నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా స్వతంత్ర గుర్తులతో ఎన్నికల నిర్వహణ జరుగుతున్నందున సర్పంచులకు, వార్డు సభ్యులకు పోటీపడి నామినేషన్లు వేయడం జరుగుతున్నది. అయితే, అభివృద్ధికి పాటుపడే వ్యక్తులనే ఎన్నుకోవాలి.
ఎన్నికల ముందు అభ్యర్థులు హామీల వరద పారిస్తారు. ఓటర్లు వారి మాయ మాటలకు లోనుకాకుండా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ' ఇప్పటివరకు అభ్యర్థి గ్రామాభివృద్ధికి ఏం చేశారు? అని ప్రశ్న అత్యంత ప్రధానమైనది. గతంలో పదవిలో ఉన్న అభ్యర్థి అయితే అతని గత అభివృద్ధి పనులు పరిశీలించాలి. కొత్త అభ్యర్థి అయితే గ్రామం కోసం చేసిన సామాజిక సేవలు పరిగణనలోకి తీసుకోవలి. వాగ్దానాల జాబితా ఎంతైనా ఉండొచ్చు.. కానీ హామీలను సాధించే, నెరవేర్చే కృతనిశ్చయం అభ్యర్థి కలిగి ఉండటం ముఖ్యం.
అభ్యర్థి వ్యక్తిత్వం అత్యంత కీలకం.
నిజాయితీగా ఉన్నవాడు, ప్రజల మాట వినేవాడు, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించగలడా? గ్రామ రాజకీయాలకు తావివ్వకుండా.. ప్రజలతో మమేకమై అన్ని వర్గాలను కలుపుకునేవాడుగా ఉండాలి. గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టే అభ్యర్థిని సర్పంచ్‌గా ఎన్నుకోవాలి.
ప్రలోభాలకు దూరంగా ఉండాలి
ఎన్నికల సమయంలో డబ్బు ఉన్నటువంటి వారు ఓటర్లకు అనేక భ్రమలు కల్పిస్తారు. ముఖ్యంగా డబ్బు, బహుమతులు, మద్యం, విందులు ఇవ్వడం సాధారణం. అవి తీసుకొని ఓటు వేయడం మన వ్యక్తిగత ప్రయోజనం అనిపించగా, గ్రామ భవిష్యత్తుకు అది పెద్ద నష్టం. డబ్బు ఇచ్చే నాయకుడు పదవిలోకి వెళ్లాక మరింత డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. అందువల్ల ఓటర్సు 'ఈరోజు ప్రయోజనం' కన్నా 5 సంవత్సరాల అభివృద్ధి గురించి ఆలోచించాలి.
గ్రామాభివృద్ధికి ఆలోచించాలి. గ్రామాన్ని ముందుకు నడిపేది సర్పంచ్ మాత్రమే. మంచి నాయకుడు ఉంటే గ్రామం అద్భుత మార్పులు చూడగలదు. చెడు నాయకుడు ఉంటే గ్రామం సంవత్సరాల పాటు వెనుకబడిపోవచ్చు. అందుకే ఓటు వేయడానికి ముందు ఓటరు నిశితంగా ఆలోచించాలి. ఓటర్ డబ్బు, విందు, వినోదానికి, భ్రమలకు దూరంగా ఉండాలి. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడం అంటే.. గ్రామ భవిష్యత్తుకు నిర్ణయం తీసుకోవడం. గ్రామ అభివృద్ధికి బాటలు వేయటం. గ్రామం అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందితేనే దేశం బలపడుతుంది. ఆ బలం మన ఓటుతో ప్రారంభమవుతుంది.
- ఉజ్జిని రత్నాకర్ రావు,
సీపీఐ సీనియర్ నేత
