- ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..
- ఉత్తర తెలంగాణ జిల్లాలపై అత్యధిక ప్రభావం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరగనున్నది. దిత్వా తుఫాను ఎఫెక్ట్ రాష్ట్రంపై పెద్దగా లేకున్నా.. ఈ నాలుగైదు రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగాయి. అయితే, ప్రస్తుతం ఆ తుఫాను తీవ్ర అల్పపీడనంగా బలహీనపడటంతో మళ్లీ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.
బుధవారం ఉదయం వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి తమిళనాడు, పుదుచ్చేరికి మధ్యలో కేంద్రీకృతమై ఉందని, అది గురువారం అల్పపీడనంగా మరింత బలహీన పడుతుందని ఐఎండీ పేర్కొన్నది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించినా.. ఎక్కడా వాన పడలేదు. తుఫాను గమనం మారడం కారణంగా రాష్ట్రంపై తుఫాన్ ఎఫెక్ట్ అంతగా లేదని అధికారులు చెప్తున్నారు. ఇక, ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది.
18 జిల్లాల్లో 15 డిగ్రీల్లోపే రాత్రి టెంపరేచర్లు రికార్డయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లో 10 డిగ్రీలు నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 11.5 డిగ్రీలు, నిర్మల్ జిల్లా సాయినగర్‌లో 11.9, నిజామాబాద్ జిల్లా సాలూరలో 12.3, కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 12.5, సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో 12.9 డిగ్రీల చొప్పున నైట్ టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యధికంగా జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరులో 19.5 డిగ్రీల మేర నైట్ టెంపరేచర్ రికార్డయింది.
హైదరాబాద్ సిటీలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 14.9 డిగ్రీల నైట్టెంపరేచర్ నమోదైంది. కాగా, రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని, చలి పెరిగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దాదాపు అన్ని జిల్లాలకూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
