బైడెన్​ ప్రైవేట్ ఆఫీస్​లో రహస్య డాక్యుమెంట్లు

బైడెన్​ ప్రైవేట్ ఆఫీస్​లో రహస్య డాక్యుమెంట్లు
  • ‘‘ది పెన్న్​ బైడెన్​ సెంటర్’’లో గుర్తించిన అధికారులు
  • వైస్​ ప్రెసిడెంట్​గా ఉన్నప్పుడే తరలింపు
  • దర్యాప్తునకు సహకరిస్తామని ప్రకటించిన వైట్​హౌస్

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్​గా ఒబామా ఉన్నప్పుడు.. బైడెన్​ వైస్​ ప్రెసిడెంట్​గా ఉన్నారు. ఆ నాటికి సంబంధించిన కొన్ని రహస్య పత్రాలు తాజాగా జో బైడెన్ ప్రైవేట్ ఆఫీస్​లో దొరికాయి. ఈ విషయాన్ని వైట్​హౌస్​ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ వ్యవహారంలో ఆర్కైవ్స్​ విభాగంతో పాటు డిపార్ట్​మెంట్ ఆఫ్​ జస్టిస్​కు వైట్​హౌస్​ పూర్తిగా సహకరిస్తుందని బైడెన్​ స్పెషల్​ కౌన్సిల్​ రిచర్డ్​ సౌబర్ తెలిపారు. 2022, నవంబర్ 2న వాషింగ్టన్​లోని ‘‘ది పెన్న్​ బైడెన్​ సెంటర్’’లో ఇవి దొరికాయన్నారు. ఈ సెంటర్​ను ఖాళీ చేసేందుకు ప్రెసిడెంట్ పర్సనల్​ అటార్నీ అక్కడికి వెళ్లారని, ఓ ర్యాక్​లోని డాక్యుమెంట్లు ప్యాక్​ చేస్తున్న టైంలో ఇవి బయటపడ్డాయని వివరించారు. క్లాసిఫైడ్​ మార్కింగ్స్​ ఉండటంతో వెంటనే ఆర్కైవ్స్​ విభాగంతో పాటు డిపార్ట్​మెంట్ ఆఫ్ జస్టిస్​కు సమాచారం ఇచ్చామన్నారు. మరుసటి రోజు ఆ రహస్య పత్రాలను వారికి అప్పగించామని తెలిపారు. అప్పటి నుంచి బైడెన్​ పర్సనల్​ అటార్నీలు ఇన్వెస్టిగేషన్​కు పూర్తిగా సహకరిస్తున్నారని వివరించారు. మెక్సికో సిటీలో నిర్వహించిన ఓ సమిట్​కు హాజరైన బైడెన్​ను.. ఈ రహస్య పత్రాలపై మీడియా ప్రశ్నించగా.. ఆయన సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. 2017 నుంచి 2020 ప్రెసిడెంట్​ ఎలక్షన్స్​ క్యాంపెయిన్​ స్టార్ట్ అయ్యే ముందు వరకు జో బైడెన్​ ‘‘ది పెన్న్​బైడెన్​ సెంటర్’’​లోనే ఉన్నారు. 

బైడెన్​పై ప్రతిపక్షాల విమర్శలు

ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా రిపబ్లికన్​ పార్టీ బైడెన్​పై విమర్శలు గుప్పిస్తున్నది. ఆ డాక్యుమెంట్ల వివరాలు వెల్లడించాలని సెనేటర్​ మార్ష్​ బ్లాక్​బర్న్​ డిమాండ్​ చేశారు. బైడెన్​ వైస్​ ప్రెసిడెంట్​గా ఉన్న టైంలో ఆయన ఇంటిపై ఎఫ్​బీఐ రెయిడ్​ చేసిందని, అప్పుడే వాటిని ప్రైవేట్​ ఆఫీస్​కు తీసుకెళ్లారని రిపబ్లికన్​ కాంగ్రెస్​ లీడర్​ 
ట్రాయ్​ నెహ్ల్స్ ఆరోపించారు.