- నిషేధం ఉన్నా గుట్టుగా బిజినెస్ నడిపిస్తున్న వ్యాపారులు
- ఇష్టారీతి రవాణాతో పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం
- తనిఖీలు చేపట్టని జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు
- ఏటా మేడారం జాతర సమయంలోనే హడావుడి
- ముందస్తు చర్యలు చేపడితేనే మహాజాతర ప్లాస్టిక్ రహితం
హనుమకొండ, వెలుగు: తెలంగాణ కుంభమేళా.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సమయం దగ్గర పడుతోంది. రెండేండ్లకోసారి జరిగే ఈ మహాజాతర ఇంకో రెండు నెలల్లో ప్రారంభం కానుండగా, కోట్లాదిగా తరలివచ్చే భక్తుల కోసం ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది. మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించినా క్షేత్రస్థాయి లోపాల వల్ల అది నెరవేరడం లేదు. వరంగల్ నగరం నుంచి విచ్చలవిడిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సప్లై అవుతుండటంతో సర్కారు లక్ష్యం నీరుగారుతోంది. కొద్దిరోజుల్లోనే మహాజాతర ప్రారంభం కానుండగా, ముందస్తు చర్యలు చేపడితేనే మేడారం మహాజాతర 'ప్లాస్టిక్ ఫ్రీ'గా నిర్వహించడం సాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గుట్టుగా గోదాంలు..
కేంద్ర పర్యావరణ శాఖ గైడ్ లైన్స్ ప్రకారం 120 మైక్రాన్లు లేదా అంతకంటే ఎక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ బ్యాగ్స్ మాత్రమే వినియోగించాలి. గతంలో 75 మైక్రాన్ల మందం కలిగిన ప్లాస్టిక్ కు అనుమతి ఉండేది. 2023 జనవరి నుంచి 120 మైక్రాన్లకు అనుమతిస్తూ కేంద్ర పర్యావరణశాఖ ఆదేశాలిచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ నిబంధన అమలు కావడం లేదు. గ్రేటర్ వరంగల్ నుంచి 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విచ్చలవిడిగా తరలుతోంది.
వరంగల్ నగరంలోని బీట్ బజార్, పిన్నవారి స్త్రీట్, టైలర్ స్ట్రీట్ తదితర చోట్ల ప్లాస్టిక్ హోల్ సేల్ వ్యాపారులు గుట్టుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను సరఫరా చేస్తున్నారు. ఓల్డ్ బీట్ బజార్, శివనగర్, ఏనుమాముల, వరంగల్ రైల్వే గేట్ తదితర ప్రాంతాల్లో గోదాంలు నడిపిస్తూ ఉమ్మడి జిల్లాలోని పట్టణాలు, మండలకేంద్రాలకు హోల్ సేల్, రిటేల్ ధరలతో సప్లై చేస్తున్నారు. వాస్తవానికి బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులు మాత్రమే వాడాలని రూల్ ఉన్నా, దానిని పట్టించుకోకుండా విక్రయాలు జరుపుతుండటంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గ్రామాలకు సరఫరా అవుతోంది.
మేడారంలో వందల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు..
మేడారం మహాజాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రెండు, మూడు జాతర్లలోనూ ప్లాస్టిక్ ఫ్రీ నినాదంతోనే మహాజాతరను నిర్వహించింది. ఈ మేరకు ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం చూపుతూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చింది. కానీ, క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారులు ప్లాస్టిక్ సప్లైకి అడ్డుకట్ట వేయలేకపోతుండటం, మేడారానికి విచ్చలవిడిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చేరుతుండటంతో మహాజాతరలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.
ఇలా ప్రతి జాతరలో కనీసం వెయ్యి టన్నులకుపైగా ప్లాస్టిక్ వ్యర్థాలు పోగు పడుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ సంకల్పానికి అడ్డంకులు ఏర్పడటంతో పాటు క్షేత్రస్థాయిలో పొల్యూషన్ పెరిగిపోతోంది. ఇప్పటికైనా సర్కారు ఆశయానికి అనుగుణంగా మేడారం మహాజాతరను ప్లాస్టిక్ ఫ్రీగా నిర్వహించేందుకు ఆఫీసర్లు తగిన చర్యలు తీసుకోవాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సప్లై జరగకుండా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
లైట్ తీసుకుంటున్న ఆఫీసర్లు..
వరంగల్ నగరంలోని కొంతమంది హోల్ సేల్ వ్యాపారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను విచ్చలవిడిగా అమ్ముతున్నా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. దీంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్రయవిక్రయాలు ఇష్టారీతిన జరుగుతున్నాయి. ప్లాస్టిక్ వినియోగంపై ఫిర్యాదులు వచ్చిన సమయంలో చిన్నచిన్న దుకాణాలపై రైడ్స్ నిర్వహించి ఫైన్లు విధిస్తున్న ఆఫీసర్లు హోల్ సేల్ బిజినెస్ నడిపించే షాప్ లపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. మున్సిపల్ ప్రజారోగ్య విభాగంలో కొందరు అధికారులు మామూళ్లకు అలవాటు పడి లైట్ తీసుకుంటున్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
లైట్ తీసుకుంటున్న ఆఫీసర్లు..
వరంగల్ నగరంలోని కొంతమంది హోల్ సేల్ వ్యాపారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను విచ్చలవిడిగా అమ్ముతున్నా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. దీంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్రయవిక్రయాలు ఇష్టారీతిన జరుగుతున్నాయి. ప్లాస్టిక్ వినియోగంపై ఫిర్యాదులు వచ్చిన సమయంలో చిన్నచిన్న దుకాణాలపై రైడ్స్ నిర్వహించి ఫైన్లు విధిస్తున్న ఆఫీసర్లు హోల్ సేల్ బిజినెస్ నడిపించే షాప్ లపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. మున్సిపల్ ప్రజారోగ్య విభాగంలో కొందరు అధికారులు మామూళ్లకు అలవాటు పడి లైట్ తీసుకుంటున్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
