టీఆర్ఎస్ సభ కోసం తహసీల్దార్ల సీక్రెట్ ​విజిట్​

టీఆర్ఎస్ సభ కోసం తహసీల్దార్ల సీక్రెట్ ​విజిట్​
  • సీఎం సభ కోసం సీక్రెట్​ సర్వే
  • హనుమకొండ జిల్లా దేవన్నపేటలో రహస్యంగా వివరాలు సేకరించిన ఆఫీసర్లు
  • ప్లేస్​ ఫిక్స్​ కాలేదంటూనే ఎక్కడికక్కడ మార్కింగ్​  
  • సాగు భూములు పాడు చేయొద్దని మూడు రోజులుగా ఆందోళనలు చేస్తున్న స్థానిక రైతులు
  • టీఆర్ఎస్​ లీడర్లు ప్రెజర్ చేస్తున్నారని ఆవేదన

హనుమకొండ, వెలుగు: ఈ నెల 29న నిర్వహించే టీఆర్ఎస్​ విజయ గర్జన సభకు అధికార పార్టీ లీడర్లు ప్లేస్​ ఫిక్స్​ చేశారు. స్థలం ఇంకా కన్​ఫామ్​ కాలేదంటూనే హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేట సరౌండింగ్​లో ఉన్న ల్యాండ్​లో రైతులకు తెలియకుండా సర్వే కూడా కంప్లీట్​ చేశారు. పండగ పూట అందరూ ఇండ్లలోనే ఉంటారనే ఉద్దేశంతో గురువారం ఉదయం ఎక్కడికక్కడ మార్కింగ్​చేసి డ్రోన్ల సహాయంతో మ్యాపులు కూడా రెడీ చేశారు. ఒక్కరోజు సభ కోసం హద్దులు చెరిపేసి, సాగు భూములు ధ్వంసం చేయడం కరెక్ట్ కాదని, ఆ తరువాత ల్యాండ్​ ప్రాబ్లమ్స్​ పెరిగితే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని దేవన్నపేట రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా సభ కోసం ల్యాండ్​ ఇచ్చి తీరాల్సిందేనని పార్టీ లీడర్లు ప్రెజర్ ​చేస్తుండటంతో పొలాల వద్దే మకాం వేసి మూడు రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. దేవన్నపేటలో సభ నిర్వహణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కూడా చేపట్టారు. అయినా అధికార పార్టీ లీడర్లు, ఆఫీసర్లు పట్టించుకోకపోగా..  సభ నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుపోతుండటం గమనార్హం.

తహసీల్దార్ల సీక్రెట్ ​విజిట్​
టీఆర్ఎస్​ 20 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించతలపెట్టిన విజయ గర్జన సభకు దేవన్నపేటలో ల్యాండ్​పరిశీలించడానికి బుధవారం వెళ్లగా.. అక్కడి రైతులు పార్టీ నేతలను అడ్డుకున్నారు. తమ భూములను మీటింగ్ కోసం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో అదే రోజు సాయంత్రం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, చీఫ్​ విప్​దాస్యం వినయ్​ భాస్కర్​ప్రెస్ మీట్​ఏర్పాటు చేసి.. మూడు ప్రాంతాలు పరిశీలనలో ఉన్నాయని, కానీ ఇంకా దేనినీ ఫిక్స్​ చేయలేదని చెప్పుకొచ్చారు. కానీ దేవన్నపేటలో పరిశీలించిన ల్యాండ్​ పరిశీలించేందుకు గురువారం ఉదయమే డ్రోన్ల సహాయంతో సర్వే నిర్వహించారు. మీటింగ్​ ప్రాంగణానికి బౌండరీలు ఏర్పాటు చేసేందుకు నిరూప్​ నగర్​తండా నుంచి ఉనికిచెర్ల వెళ్లే మార్గంలో మార్కింగ్​ చేశారు. ఆ తరువాత హసన్​పర్తి, కాజీపేట తహసీల్దార్లు బండి నాగేశ్వరరావు, కిరణ్​కుమార్​అక్కడున్న ప్లాట్ల ఓనర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సీక్రెట్​గా విజిట్​ చేశారు. సభా ప్రాంగణం కోసం ప్రతిపాదించిన స్థలంలో బైక్​పై చెక్కర్లు కొట్టి వెళ్లారు. ఆ తరువాత స్థానిక వీఆర్ఏలు మ్యాపులు పట్టుకుని హడావుడి స్టార్ట్​ చేశారు. పోలీసులు కూడా సీక్రెట్​గా వచ్చి తమ పని తాము చేసుకునిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

ల్యాండ్​ ఇవ్వాలని ప్రెజర్
టీఆర్ఎస్​భారీ బహిరంగ సభ కోసం ల్యాండ్​ఇవ్వాల్సిందిగా పార్టీ లీడర్లు బలవంతం చేస్తున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. మున్ముందు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మసులుకోవాల్సిందిగా బ్లాక్​మెయిల్​చేస్తున్నారని పేర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డికి అత్యంత సన్నిహితుడైన డీసీసీబీ డైరెక్టర్​గుండ్రెడ్డి రాజేశ్వర్​రెడ్డి వచ్చి రైతులతో మాట్లాడారు. మెల్లిగా రైతులను ల్యాండ్​ ఇచ్చేందుకు ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా వ్యవసాయ భూములు ఇచ్చేందుకు ససేమిరా అనడంతో స్థానిక నేతలతో మాట్లాడి ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంత జరుగుతుంటే రైతుల పక్షాల నిలవాల్సిన టీఆర్ఎస్​ పెద్ద లీడర్లు పట్టించుకోకుండా సభ కోసం స్వార్థ పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

కొనసాగుతున్న ఆందోళనలు
భారీ బహిరంగ సభకు దేవన్నపేట వ్యవసాయ, ఇండ్ల ప్లాట్లను పరిశీలించడాన్ని వ్యతిరేకిస్తూ మూడు రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. కంటి మీద కునుకు లేకుండా పొలాల వద్దే మకాం వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం వచ్చిన లీడర్లు ఇప్పుడు రైతులను సంప్రదించకుండా పంటలను నాశనం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్​ భారీ బహిరంగ సభను వేరే చోట నిర్వహించుకోవాలని, తమ భూముల్లో పెడితే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఇతర లీడర్లు రైతుల పక్షాల నిలబడి సభను వేరేచోట నిర్వహించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.