బలంగానే ఉన్న సెక్రటేరియెట్, అసెంబ్లీ కాంప్లెక్స్‌‌లు  

బలంగానే ఉన్న సెక్రటేరియెట్, అసెంబ్లీ కాంప్లెక్స్‌‌లు  
  • మరో 60 ఏండ్ల వరకు వాడుకునే అవకాశం
  • ఏపీ బ్లాక్​లు రావడంతో సెక్రటేరియెట్​లో ఇంకింత వెసులుబాటు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సెక్రటేరియెట్, అసెంబ్లీలకు కొత్త బిల్డింగ్ లు కట్టాలని సర్కారు నిర్ణయించడాన్ని సవాల్​ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఓవైపు వారసత్వ భవనాలు కూల్చొద్దని, మరోవైపు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని కొందరు లీడర్లు, కొన్ని ప్రజాసంఘాలు వేసిన ఈ పిటిషన్లపై విచారణ జరుగుతోంది. దీనిపై సంఘాల వాదనలు, ప్రభుత్వ తరఫు వాదనలతో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే సమయంలో అటు అసెంబ్లీ బిల్డింగ్ లు, ఇటు సెక్రటేరియెట్ బిల్డింగ్ లు ప్రభుత్వ అవసరాలకు ఏ మాత్రం సరిపోవనీ, అసలు ఎందుకూ పనికిరావంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సెక్రటేరియెట్, అసెంబ్లీ కాంపౌండ్లలో ఉన్న భవనాల వయసు, వాటిని ఎంతవరకు ఉపయోగించుకునే అవకాశం ఉందన్న వివరాలు ఇవి..

రాష్ట్ర సెక్రటేరియెట్ మొత్తం 25 ఎకరాల్లో ఉంది. ఇందులో పాలన అవసరాలకు ఉపయోగపడే ఆఫీస్ స్పేస్ 7,54,000 చదరపు అడుగులు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు కేటాయించిన ఏ, బీ, సీ, డీ బ్లాక్ లలో 3 లక్షల చదరపు అడుగుల స్పేస్ ఉంది. ఏపీకి కేటాయించిన హెచ్, కే, ఎల్ బ్లాక్ లలో 4 లక్షల చ.అ. చోటు ఉంది. రెండు రాష్ట్రాలకు కలిపి 54,000 చ.అ. కామన్ ఏరియా ఉంచారు. ఇందులోనే ఆంధ్రా బ్యాంక్, ఎస్​బీఐ, క్యాంటీన్, నల్లపోచమ్మ గుడి, మసీద్ ఉన్నాయి. ఈమధ్యే రాష్ట్ర గవర్నర్ తనకున్న అధికారాలతో ఏపీకి కేటాయించిన బ్లాక్ లను కూడా రాష్ట్ర సర్కారుకు అప్పగించారు. దీంతో ఇప్పుడు సెక్రటేరియెట్ మొత్తం రాష్ట్ర సర్కారు చేతికి వచ్చింది. అంటే ఏడున్నర లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ మొత్తాన్ని సర్కారు ఉపయోగించుకునే అవకాశం ఉంది.

పెద్ద బిల్డింగ్ లు, కావాల్సినంత జాగా

సెక్రటేరియెట్​లో మొత్తం 9 బ్లాక్ లు ఉపయోగంలో ఉన్నాయి. వాటిలో 1954లో కట్టించిన కే బ్లాక్ ఒక్కటి తప్ప మిగిలినవన్నీ 40 ఏండ్లలోపు భవనాలే. 2003లో కట్టిన డీ బ్లాక్ చాలా ఉపయోగపడుతుంటే 2013లో కట్టిన హెచ్ బ్లాక్ అన్నింటి కంటే కొత్త బిల్డింగ్. నిజానికి ఇప్పుడు ఏపీ నుంచి బిల్డింగ్ లు చేతికి రావడంతో రాష్ట్ర అవసరాలకు మించిన జాగా అందుబాటులోకి వచ్చింది. ఇక వాడకంలో లేని జీ బ్లాక్ రాష్ట్ర వారసత్వ సంపదగా ఉంది. ఆరో నిజాం కట్టించిన ఈ భవనం నుంచే నాటి సీఎంలు బూర్గుల, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, టి.అంజయ్య, భవనం వెంకట్రామ్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీఆర్ పాలన సాగించారు. కొత్త సెక్రటేరియెట్ నిర్మించాలన్న నిర్ణయంతో ఈ భవనం కూడా కనుమరుగు కానుంది. దీంతో పాటే ఏడేండ్ల నుంచి 40 ఏండ్లలోపు వయసున్న కొత్త భవనాలను కూడా కూల్చేయనున్నారు. అందుకే దీన్ని ప్రజాసంఘాలు, పార్టీలు కోర్టులో సవాల్ చేస్తున్నాయి. వందకోట్ల రూపాయలకుపైగా ఖర్చుతో వేర్వేరుగా కట్టించిన ఈ భవనాలను ఇంకో 60 ఏండ్లకుపైగా ఉపయోగించుకునే అవకాశం ఉందని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. వీటిని నిర్మాణాలుగానే కాకుండా తెలంగాణ ప్రజల చరిత్రగా చూడాలని వారు అంటున్నారు. దేశంలోనే ఆధునిక పరిపాలన, భూసంస్కరణలను అమలుచేసిన కేంద్రంగా సెక్రటేరియట్ కు ప్రత్యేక చరిత్ర ఉందని వారు గుర్తుచేస్తున్నారు.

పాత కొత్తల అసెంబ్లీ

అసెంబ్లీ బిల్డింగ్ ల విషయంలోనూ అవి అవసరాలకు పనికిరావన్న వాదనను సర్కారు వినిపిస్తోంది. నిజానికి ఇప్పుడు ఉపయోగిస్తున్న బిల్డింగ్ నిజాం ప్యాలెస్ నమూనాలోనే కట్టించిన కొత్త భవనం. 39 ఏండ్ల వయసున్న ఈ బిల్డింగ్ ను మరికొన్ని దశాబ్దాల పాటు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 294 మంది సభ్యులతో పాటు శాసన మండలికి కూడా ఉపయోగించిన భవనం ఇది. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీ సభ్యుల సంఖ్య 119 మాత్రమే ఉంది. అలాగే అనుకూలమైన చోట, అది కూడా హైసెక్యూరిటీ జోన్ లో అసెంబ్లీ ఉంది. ఎదురుగా విశాలమైన రోడ్లు ఉండడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ కుగానీ, సెక్యూరిటీ పరంగా గానీ ఇప్పటివరకు ఎలాంటి సమస్య రాలేదు. మెట్రో నిర్మాణం వల్ల అసెంబ్లీ అందం దెబ్బతింటుందని మొదట్లో రాష్ట్ర సర్కారు భావించింది. ఈ కారణంతోనే మెట్రో నిర్మాణం చాలాకాలం లేటైంది కూడా. తర్వాత సర్కారు మనసు మార్చుకోవడంతో మెట్రో లైన్ పూర్తయింది. ఇప్పడు అదే అసెంబ్లీకి నెక్లెస్ లా కనిపిస్తూ బిల్డింగ్ కు కొత్త అందం తెచ్చింది.

అసెంబ్లీ పాత టౌన్ హాల్

1905లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 40వ పుట్టినరోజుకు గుర్తుగా దీని నిర్మాణం ప్రారంభించారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో 1913లో పూర్తయింది. టౌన్ హాల్ గా పిలిచేవారు. 1952 నుంచి 1980 దాకా అసెంబ్లీగా వాడారు. తర్వాత వినియోగంలో లేదు. మరో వందేండ్లు నిలబడగలదని నిపుణులు చెబుతున్నారు.

 

 

అసెంబ్లీ ప్రస్తుత బిల్డింగ్

ఉమ్మడి ఏపీ సర్కారు 1980లో దీన్ని నిర్మించింది. రాష్ట్ర మంత్రులకు, రాజకీయ పార్టీలకు ఆఫీసుల కోసం పాత హెరిటేజ్ భవనం పక్కనే, అదే మోడల్​లో కట్టారు. 39 ఏండ్ల ఈ భవనం మరో 60 ఏండ్ల వరకు ఉపయోగించుకునే వీలుంది. ఇంకా భవనాలు కట్టుకునే జాగా ఉంది. హైసెక్యూరిటీ జోన్ కాబట్టి ఇబ్బందుల్లేకుండా  వాడుకోవచ్చు.

 

జీ బ్లాక్ (సర్వహిత భవనం)

దీన్ని 1887లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కట్టించాడు. సైఫాబాద్ ప్యాలెస్ గా పిలిచేవారు. 1950ల్లో హైదరాబాద్ స్టేట్ కు తొలి సెక్రటేరియట్ గా నాటి సీఎం బూర్గుల రామకృష్ణారావు ఉపయోగించిన బిల్డింగ్ ఇదే. 132 ఏండ్ల ఈ భవనాన్ని హెరిటేజ్ నిర్మాణంగా పరిరక్షిస్తున్నారు.

 

 

హెచ్ బ్లాక్

సెక్రటేరియట్ లోని అన్ని నిర్మాణాల్లో కొత్తది ఇదే. ఉమ్మడి ఏపీలో వైఎస్​ హయాంలో నిర్మాణం మొదలై.. 2012లో కిరణ్​కుమార్​ రెడ్డి పాలనా సమయంలో పూర్తయింది. ఈ భవనం వయసు ఏడేండ్లే. దీన్ని ఇంకా 70 ఏండ్లకు పైగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంది.