ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
  •     పేదలందరికీ పథకాలు అందిస్తున్న సర్కారు
  •     ఆరు గ్యారంటీల అమల్లో చిత్తశుద్ధితో ముందుకు..
  •     దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పథకాలు
  •     ప్రజా పరిపాలన వేడుకల్లో ప్రజాప్రతినిధులు
  •     ఊరూవాడా సంబురాలు

నెట్​వర్క్, వెలుగు: పేదల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తోందని, ప్రజలకిచ్చిన హామీలు, ఆరు గ్యారంటీల అమల్లో చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజాపాలన వేడుకలకు ఆయన చీఫ్ ​గెస్ట్​గా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. 

పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ.. రాచరికపు పాలన నుంచి విముక్తి పొంది సువిశాల భారతదేశంలో తెలంగాణ కలిసిన రోజుకు గుర్తుగా ప్రజాపాలన దినోత్సవం నిర్వహించుకోవడం గర్వకారణమన్నారు. కుమ్రంభీం స్ఫూర్తితో రేవంత్ సర్కార్ పనిచేస్తోందన్నారు. ఆరు గ్యారంటీల అమలుతో బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరిగిందని పేర్కొన్నారు. 

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో కోటీ 68 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జిల్లాలో 11,997 మంది పేదలు వైద్య చికిత్సలు పొందారని చెప్పారు. జిల్లాలో 7,398 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, డేవిడ్, డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఏఎప్పీ చిత్తరంజన్ ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.

ప్రజాపాలనలో అభివృద్ధి దిశగా తెలంగాణ

సీఎం రేవంత్ ​రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని ప్రభుత్వ సలహాదారు మహ్మద్​ షబ్బీర్​ అలీ అన్నారు. బుధవారం ఆదిలాబాద్​కలెక్టర్​ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన వేడుకలను ఆయన హాజరయ్యారయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. 

అనంతరం మాట్లాడుతూ ప్రజా పాలనలో మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు వంటి గ్యారంటీలను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. కలెక్టర్ ​రాజర్షి షా, ఎంపీ గొడం నగేశ్, ఎస్పీ అఖిల్​మహాజన్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి

రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు అన్నారు. మంచిర్యాల కలెక్టరేట్​లో నిర్వహించిన వేడుకలకు చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. జాతీయ జెండా అవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ సమాజం రాచరిక వ్వవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి యావత్ తెలంగాణ సమాజం కృషి చేసిందన్నారు. 

అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రం సాధించుకొని అభివృద్ధి పథంలో దేశంలోనే ముందుంజలో ఉందన్నారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ అరోగ్యశ్రీ, మహాలక్ష్మి, గృహజ్యోతి ఇలా అనేక పథకాలు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్లు, డీసీపీ భాస్కర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. 

ఊరూవాడా వేడుకలు

ప్రజాపానల వేడుకలను పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో, ప్రభుత్వ కార్యాలయాలు, సింగరేణి ఏరియాల్లో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాలు ఎగురవేశారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తోందని నేతలు పేర్కొన్నారు. మందమర్రిలో భారీ ర్యాలీ నిర్వహించారు.

అధికారుల సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యం

అన్ని శాఖల అధికారుల సమిష్టి కృషితోనే  అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. నిర్మల్​కలెక్టరేట్​లో జరిగిన ప్రజాపాలన వేడుకలకు ఆయన చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలతో లక్షలాదిమంది ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాలందరికీ అండగా నిలుస్తోందన్నారు. 

దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలకు నష్టం జరగకుండా అధికారులంతా సమిష్టిగా కృషి చేయడం అభినందనీయమన్నారు. అంతకుముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 

భారీ వర్షాల కారణంగా పశువులను కోల్పోయిన బాధితులకు ఆర్థిక సాయం పత్రాలు అందించారు. స్వచ్ఛోత్సవ్ పక్షోత్సవ్ కార్యక్రమ పోస్టర్లను కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, ఏఎస్పీ రాజేశ్ మీనా తదితరులు పాల్గొన్నారు.