ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంబురంగా ప్రజా పాలన దినోత్సవం

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంబురంగా ప్రజా పాలన దినోత్సవం

మహబూబ్​నగర్/గద్వాల, వనపర్తి/కందనూలు, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో బుధవారం ప్రజా పాలన దినోత్సవాన్ని సంబురంగా జరుపుకున్నారు. మహబూబ్​నగర్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు, నారాయణపేటలో వాకిటి శ్రీహరి, గద్వాలలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్​రెడ్డి, వనపర్తిలో  చీఫ్​ విప్​ పట్నం మహేందర్​రెడ్డి, నాగర్​కర్నూల్​లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు​జి చిన్నారెడ్డి కలెక్టరేట్లలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. చిన్నారుల కల్చరల్​ ప్రోగ్రామ్స్​ ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

భూభారతితో ఇబ్బందులు తొలగిస్తున్నాం..

రైతులను ఆదుకునేందుకు సీఎం రేవంత్​రెడ్డి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ధరణి పోర్టల్​తో  రైతులు పడుతున్న ఇబ్బందులు దూరం చేసేందుకు భూ భారతిని తీసుకొచ్చాం. దీని ద్వారా రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నాం. నారాయణపేట జిల్లాలో రుణమాఫీ కింద 65,631 మంది రైతులకు రూ.574 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. రైతు భరోసా కింద 1,79,154 మంది రైతులకు రూ.260.56 కోట్లు అందించాం. ఇక్కడి బీడు భూములకు సాగునీటిని అందించేందుకు నారాయణపేట–-కొడంగల్​ లిఫ్ట్​ స్కీమ్​ను ఏర్పాటు చేస్తున్నాం. లక్ష ఎకరాలకు సాగు నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం.-వాకిటి శ్రీహరి, మంత్రి

సంక్షేమ పథకాల అమలులో ఆదర్శం..

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోంది. సీఎం రేవంత్​రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచే తెలంగాణలో అసలైన స్వేచ్ఛా వాతావరణం కనిపిస్తోంది. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజాస్వామిక శకం ఆరంభమైంది. పారదర్శకమైన ప్రజాపాలనతో సమాజంలోని అన్నివర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. –జూపల్లి కృష్ణారావు, మంత్రి

 ప్రజల ఆశయాలను నిజం చేస్తున్నాం..

తెలంగాణ ప్రజల ఆశయాలను, ఇచ్చిన వాగ్దానాలను ప్రజా ప్రభుత్వం నిజం చేస్తుంది. ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాం. 6,768 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. 687 డబుల్  బెడ్రూమ్  ఇండ్లు లబ్ధిదారులకు అందించాం. ప్రస్తుతం గద్వాల జిల్లాలో 2,61,655 ఎకరాలకు సాగు నీటిని అందిస్తున్నాం.  -ఏపీ జితేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి

అభివృద్ధి, సంక్షేమంలో ముందంజ..

నాగర్​కర్నూల్​ జిల్లా అభివృద్ధి, సంక్షేమంలో ముందంజలో ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రజాప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోంది. ఎన్నో ఏండ్లుగా ప్రజలు ఎదురు చూస్తుండగా, అర్హులందరకీ రేషన్​కార్డులు పంపిణీ చేసి భరోసా కల్పించాం. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నాం. జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.- జి చిన్నారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు

హామీలను నెరవేరుస్తున్నాం..

అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నాం. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు జిల్లాలో 10 మండల మహిళా సమాఖ్యలకు 10 ఆర్టీసీ బస్సులను అందించాం. జిల్లాలో 17,490 కొత్త రేషన్  కార్డులు పంపిణీ చేశాం. జిల్లాలో 6,173 ఇండ్లను మంజూరు చేయగా, 3,731 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రైతు భరోసా కింద 1,75,869 మంది రైతులకు రూ.205.93 కోట్లు అందజేశాం.- పట్నం మహేందర్​రెడ్డి, చీఫ్​ విప్