
ఆసిఫాబాద్, వెలుగు: జల్, జంగల్, జమీన్ కోసం పోరాటం చేసిన మన్నెం వీరుడు కుమ్రంభీం పోరాటం గొప్పదని రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. బుధవారం కెరమెరి మండలం జోడేఘాట్‌ను ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆదివాసీ సంఘ నాయకులతో కలిసి సందర్శించి కుమ్రం భీం విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కుమ్రం భీం మ్యూజియాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపిన పోరాట యోధుడు కుమ్రంభీం అన్నారు.
జోడేఘాట్ ప్రాంతం చరిత్రాత్మకమైందని, ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కుమ్రంభీం మ్యూజియంలోని ఆదివాసీల పురాతన వస్తువులతో వారి ఆచార వ్యవహారాలు, ఆధునికతను జోడించి జీవన విధానంలో వస్తున్న మార్పులు వంటి విషయాలు తెలుసుకోవచ్చన్నారు. అక్టోబర్ 7న నిర్వహించనున్న వర్ధంతికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.