సెక్రటేరియెట్​ షిఫ్టింగ్ ​స్లో

సెక్రటేరియెట్​ షిఫ్టింగ్ ​స్లో

సెక్రటేరియెట్ షిఫ్టింగ్ మొదలై పదిహేను రోజులుదాటుతున్నా ఇప్పటికీ సగం కూడా పూర్తి కాలేదు. ఈ నెలాఖరుకల్లా షిఫ్టింగ్ పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మరో వారం రోజుల సమయమే ఉండటంతో ఆలోగా షిఫ్టింగ్ పూర్తవుతుందా అంటే అనుమానమేనని ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వ శాఖలలో అతిపెద్ద శాఖ అయిన రెవెన్యూతోపాటు హౌసింగ్​, మరి కొన్ని శాఖల తరలింపు  ఇప్పటికీ మొదలుకాలేదు.

మెట్రోరైల్​ భవన్​కు సీఎంవో!

బేగంపేట మెట్రో రైల్ భవన్ కు సీఎం ఆఫీసు షిఫ్ట్​ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అక్కడ రెండు ఫ్లోర్లు ఇచ్చేందుకు మొదట అధికారులు ప్రతిపాదించారు. ఇప్పుడు భవనం మొత్తాన్ని సీఎంవోకు ఉపయోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ భవన్​లో ఉన్న మెట్రోరైల్​ కార్యాలయాన్ని  సైఫాబాద్ లోని పాత మెట్రో రైల్ భవన్ లోకి షిఫ్ట్​ చేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు తెలుస్తోంది.

షిఫ్టింగ్​కు ముందుకు రాని ఏజెన్సీలు

సెక్రటేరియెట్ షిఫ్టింగ్​ను శాఖల వారీగా విభజించి మొత్తం ఏడు ఏజెన్సీలకు షిఫ్టింగ్ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. అయితే తరలింపు మొదలైన నాటి నుంచి మూడు ఏజెన్సీలు మాత్రమే ఆ పనుల్లో పాల్గొంటున్నాయి. షిఫ్టింగ్ పూర్తయిన తర్వాతే బిల్లులు మంజూరు చేస్తాననని ప్రభుత్వం చెప్పటం, ఇప్పటికే తాము చేసిన వివిధ పనులకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం వద్ద పెండింగ్​లో ఉండటంతో.. మిగతా నాలుగు సంస్థలు సెక్రటేరియెట్​ షిఫ్టింగ్​లో పాల్గొనడం లేదని సెక్రటేరియెట్​ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. సెక్రటేరియెట్​లోని 80శాతం శాఖలను బీఆర్కే భవన్​కు తరలిస్తుండటంతో వచ్చే నెల 1 నుంచి భవన్​లో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అధికారులు అంటున్నారు.  భవన్​లో మరమ్మతులు వేగంగా కొనసాగుతున్నాయి.