
హైదరాబాద్, వెలుగు: గురుకులాల్లో చదువుతున్న, చదివిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా సమగ్ర కార్యక్రమాలను చేపడుతున్నామని ఎస్సీ గురుకులాల కార్యదర్శి డాక్టర్ అలుగు వర్షిణి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.10వ తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ పూర్తి చేసిన వారు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థుల్లో నిరుద్యోగుల కోసం ప్రత్యేక శిక్షణా ప్రణాళిక రూపొందించామని ఆమె తెలిపారు. ఈ లక్ష్యంతోనే ఎస్‌జీబీఎస్ ఉన్నతి ఫౌండేషన్‌తో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఒప్పందం చేసుకున్నట్టు పేర్కొన్నారు.
ఈ క్రమంలో యూఎన్ఎక్స్ టీ సంస్థ ఆధ్వర్యంలో 165 గంటల నైపుణ్య శిక్షణ అందించనున్నట్టు చెప్పారు. 25 ఏండ్ల లోపు వయస్సు ఉన్న పూర్వ విద్యార్థులు, ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ శిక్షణకు అర్హులన్నారు. ప్రత్యేక శిక్షణ జూన్ మూడో వారం నుంచి ప్రారంభమవుతుందని, ఒక్కో బ్యాచ్‌లో 40 మంది చొప్పున 45 రోజుల శిక్షణ ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 238 గురుకుల కేంద్రాల్లో ఈ శిక్షణా కార్యక్రమం చేపట్టనున్నట్టు చెప్పారు.