
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU) దగ్గర పోలీసులు 144 సెక్షన్ విధించారు. హాస్టల్ ఫీజులు పెంచుతున్నట్లు యూనివర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకోవడంతో JNU స్టూడెంట్స్ ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ(సోమవారం) పార్లమెంట్ ముట్టడికి విద్యార్థులు పిలుపునిచ్చారు. దీంతో జేఎన్‌యూతో పాటు పార్లమెంట్ పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ప్రభుత్వ విద్యను కాపాడాలని ఎంపీలకు తెలియజేసేందుకే తాము పార్లమెంట్ వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు విద్యార్థులు తెలిపారు. అయితే పోలీసులు మాత్రం ర్యాలీకి అనుమతించడం లేదు. యూనివర్సిటీ చుట్టూ సుమారు 1200 మందికి పైగా పోలీసులు మోహరించారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.