హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఆంక్షలు విధిస్తూ పోలీసు శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజా శాంతి, భద్రత కోసం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో సెక్షన్ 144 అమల్లో ఉంచుతూ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తెలిపారు. ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకేచోట గుమికూడడం నిషేధం.
ఈ నిషేధం 200 మీటర్ల పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్లకు వర్తిస్తుంది. పోలింగ్ జరిగే తేదీ నవంబర్ 11న.. ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు నియోజకవర్గ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సజ్జనార్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెల్లడించే నవంబర్ 14న.. ఉదయం 6 గంటల నుంచి, నవంబర్ 15న ఉదయం 6 గంటల వరకూ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీస్ శాఖ వెల్లడించింది.
జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజా శాంతి, శాంతి మరియు ప్రశాంతతను కాపాడే ఉద్దేశంతో.. నగర పోలీస్ చట్టం, 1348 (నం.IX) సెక్షన్ 67 (సి) కింద తనకు ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుని ఈ ఆదేశాలను ఇచ్చినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సందర్భంగా.. పబ్లిక్ రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు పేల్చడం, టపాసులు విసరడం నిషేధం అని ఈ నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు. పోలీసు శాఖ ఆదేశాలను ఉల్లంఘించిన ఏ వ్యక్తి అయినా ప్రాసిక్యూషన్‌కు గురవుతారని పోలీసులు హెచ్చరించారు.
