బీసీ రిజర్వేషన్ల కోసం ఐదు లక్షల మందితో సభ ..గెస్ట్గా ప్రధాని మోదీని పిలుస్తాం..ఆర్.కృష్ణయ్య

బీసీ రిజర్వేషన్ల కోసం ఐదు లక్షల మందితో సభ ..గెస్ట్గా ప్రధాని మోదీని పిలుస్తాం..ఆర్.కృష్ణయ్య

బషీర్​బాగ్​, వెలుగు: బీసీ రిజర్వేషన్ల కోసం జనవరిలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఐదు లక్షల మంది బీసీలతో బహిరంగ సభ నిర్వహిస్తామని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఆ సభకు ప్రధాని నరేంద్రమోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తామని చెప్పారు. కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్​ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ప్రధానిగా బీసీ వ్యక్తి ఉన్న సమయంలోనే రిజర్వేషన్లు సాధించుకోవలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 16న హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద న్యాయ సాధన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు జిల్లపల్లి అంజి, రాందేవ్ మోడీ, రాజేందర్  తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే

ముషీరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఇవ్వాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ నేతలు నీల వెంకటేశ్, పగిళ్ల సతీశ్ ఆధ్వర్యంలో గురువారం బర్కత్ పురా లో నిర్వహించిన విద్యార్థుల ర్యాలీలో ఆయన మాట్లాడారు. 

పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు పోవాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. హైకోర్టులో రిజర్వేషన్ల బిల్లుపై ప్రభుత్వం సమర్థవంతమైన న్యాయవాదులను పెట్టి, వాదించాలని విజ్ఞప్తి చేశారు