లష్కర్ బోనాలకు ఏర్పాట్లు పూర్తి

లష్కర్ బోనాలకు ఏర్పాట్లు పూర్తి

ఆదివారం నుంచి లష్కర్ బోనాల సందడి మొదలవుతోంది. మహంకాళి అమ్మవారికి ఎదుర్కోలుతో సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం ఏడింటికి అమ్మవారికి పసుపు, కుంకుమ, సారే  సమర్పణతో ఆలయంలో పూజలు మొదలుపెడతారు. ఈనెల 8 నుంచి ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు.

ఆదివారం ఘటం అలంకరణ పూర్తి చేసుకొని, సోమవారం ఉదయం నుంచి అమ్మవారు ఘటంపై ఊరేగుతారు. సోమవారం నుంచి ఘటోత్సవం మొదలవుతుంది. 8 ఉదయం పదింటికి దేవాలయం నుంచి బయలుదేరి హిమంబావి, డొక్కలమ్మ దేవాలయం వీధిలో ఘటంపై ఊరేగుతూ.. భక్తుల పూజలు అందుకొని సాయంత్రం ఏడుగంటలకు దేవాలయానికి చేరుకుంటారు. ఈనెల 9 నుంచి  18 వ తేదీ వరకూ వివిధ ప్రాంతాల్లో ఘటాల ఊరేగింపు ఉంటుంది.  19న మాత్రం ఉదయం పదింటి నుంచి మధ్యాహ్నం 2వరకు మాత్రమే అమ్మవారి ఘటం ఊరేగింపు జరుగుతుంది.

14న అమ్మవారికి మొదటిబోనం సమర్పిస్తారు. 16న చంద్రగ్రహణం ఉండటంతో  ఉదయం నాలుగింటి నుంచి   మధ్యాహ్నం మూడింటి దాకా ఒడి బియ్యం పోసే  అవకాశముంది. 17న  ఉదయం పదింటి  తర్వాత నుంచి రాత్రి వరకు ఒడి బియ్యం కార్యక్రమం కొనసాగుతుంది. 21న  ఉజ్జయిని మహంకాళి బోనాలు, 22న రంగం, 23న అమ్మవారికి 30 కేజీల  పసుపు, కుంకుమతో అభిషేకం చేస్తారు. జాతర కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ అధికారులు. ఈఏడాది మినీ జాతర కంటే ముందు  భక్తుల రద్దీ ఎక్కువ ఉండే అవకాశముందనీ… .అందుకోసం ముందుగానే క్యూలైన్లపై దృష్టి పెట్టామన్నారు.

ఈ  ఏడాది కూడా ఆనవాయితీ ప్రకారం సురిటీ అప్పయ్య కుటుంబసభ్యులు అమ్మవారికి పసుపు, కుంకుమ, సారే సమర్పిస్తారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. తమ కుటుంబసభ్యులు అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించిన తర్వాతే ఉత్సవాలు ప్రారంభమవుతాయని అంటున్నారు. జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ఘటంతో మొదలయ్యే లష్కర్ బోనాలు..రంగంతో ముగుస్తాయి.