కంటోన్మెంట్​లో..బై ఎలక్షన్ హీట్​

కంటోన్మెంట్​లో..బై ఎలక్షన్ హీట్​
  •     టికెట్​ కోసం ఆశావహులు ప్రయత్నాలు 
  •     ప్రచారం మొదలుపెట్టిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు
  •     తమకే టికెట్ వస్తుందంటూ ప్రచారం.. 
  •     బీఆర్ఎస్​టికెట్ ఆశిస్తున్న లాస్య నందిత అక్క నివేదిత
  •     బీఆర్ఎస్​నుంచి పోటీకి రెడీ అవుతున్న ఉద్యమకారులు 

కంటోన్మెంట్, వెలుగు : లోక్​సభ ఎన్నికలతోపాటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్​కు ఉప ఎన్నిక నిర్వహిస్తామని ఎలక్షన్​కమిటీ ప్రకటించింది. మే 13న పోలింగ్​ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో స్థానిక రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్నవారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత అక్క నివేదిత బీఆర్ఎస్​నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు. పార్టీ హైకమాండ్​స్పందించి, తనకే టికెట్ ఇవ్వాలని కోరారు.

 మరోవైపు కాంగ్రెస్, బీజేపీ టికెట్లు ఆశిస్తున్నవారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రజలను కలుస్తూ తామే పోటీలో ఉంటామని చెప్పుకుంటూనే.. మరోవైపు టికెట్​కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గతేడాది నవంబర్​లో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన లాస్యనందిత గత నెల 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిందే. దీంతో బై ఎలక్షన్​అనివార్యమైంది. 

4 నెలల్లో రెండోసారి.. 

కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం1957లో ఏర్పడగా, 1969లో మొదటిసారి ఉప ఎన్నికలు జరిగాయి. మే13న జరిగేవి రెండో ఉప ఎన్నికలు. ఐదు సార్లు కంటోన్మెంట్ సెగ్మెంట్​కు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సాయన్న గతేడాది అనారోగ్యంతో మృతి చెందగా, గతేడాది నవంబరు 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కూతరు లాస్య నందిత బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆమె 82 రోజులు మాత్రమే ఎమ్మెల్యేగా కొనసాగారు. గత నెల 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కంటోన్మెంట్ లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది.

తెరపైకి కొత్త పేర్లు

అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈసారి కొత్త వ్యక్తులను బరిలో దింపనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా బీఎస్పీ స్టేట్​చీఫ్​పదవికి రాజీనామా చేసి, బీఆర్ఎస్​లో చేరిన ఆర్.ఎస్.ప్రవీణ్​కుమార్ బీఆర్ఎస్​అభ్యర్థిగా పోటీలో ఉంటారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సీనియర్​నేత అద్దంకి దయాకర్​ను పోటీలో ఉంచాలని కాంగ్రెస్ హైకమాండ్​ఆలోచిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మరి ఫాదర్​సెంటిమెంట్ వర్క్ అవుట్​అవుతుందనే ఆలోచనతో అటు బీఆర్ఎస్​నుంచి నివేదిత, ఇటు కాంగ్రెస్​నుంచి వెన్నెలను బరిలోకి దింపుతారో లేక కొత్త వారికి చాన్స్​ఇస్తారో చూడాలి.

తెరపైకి మాదిగ నినాదం

నియోజకవర్గంలో మెజారిటీ ఓట్లు మాదిగలవేనని, అన్ని పార్టీలు మాదిగలకే టికెట్లు కేటాయించాలని మాదిగ ఆత్మగౌరవ ప్రతినిధులు డిమాండ్​చేశారు. ఈ మేరకు సోమవారం కంటోన్మెంట్ లో సమావేశం నిర్వహించారు. రిజర్వుడ్​స్థానమైన కంటోన్మెంట్​లో మాదిగలకు టికెట్లు ఇవ్వడంలో అన్ని రాజకీయ పార్టీలు వివక్ష చూపుతున్నాయని నేతలు ఆరోపించారు. కేవలం కార్యకర్తలుగా చూస్తున్నాయని మండిపడ్డారు. ‘జనం మనది.. బలం మనది.. టికెట్, గెలుపూ మనదే కావాలి’ అనే నినాదంతో పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వివిధ అసోసియేషన్లకు చెందిన కిషన్, గోపి, మురళి, శివ, సునీల్, అజిత్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. 

నివేదితకు అవకాశం దక్కేనా?

నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ నాయకుల కోరిక మేరకు తాను పోటీలో ఉంటానని లాస్య నందిత సోదరి నివేదిత ప్రకటించారు. అంతే కాకుండా ఉప ఎన్నిక ఏకగ్రీమయ్యేలా అన్ని పార్టీల నేతలు సహకరించాలని కోరారు. తన తల్లితో వెళ్లి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​ను కలిసి టికెట్ కేటాయించాలని రిక్వెస్ట్​చేశారు. అయితే ఎన్నో ఏండ్లుగా సాయన్న కుటుంబానికే అవకాశాలు అందుతున్నాయని, ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని పలువురు ఉద్యమకారులు కోరిన్నట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్​నేతలు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుస్తున్నారు. గతంలో బీఆర్ఎస్​టికెట్​ఆశించిన మన్నె క్రిశాంక్, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నగేశ్​పార్టీ హైకమాండ్​అవకాశం ఇస్తే పోటీకి సిద్ధమంటున్నట్లు తెలుస్తోంది. 

ఎవరికి వారు పలు కార్యక్రమాలతో ప్రజలను కలుస్తూ ముందుకు వెళ్తున్నారు. మరోవైపు నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్.. తనకే టికెట్​దక్కుతుందని ధీమాగా ఉన్నారు. బీజేపీ నుంచి మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్​అభ్యర్థిగా బరిలో దిగి మూడో స్థానానికి పరిమితమైన గద్దర్ కూతురు వెన్నెల ఈసారి కూడా తానే పోటీ చేస్తానని చెబుతున్నారు. పలు కార్యక్రమాలతో ప్రజలను కలుస్తున్నారు. వెన్నెలతోపాటు కాంగ్రెస్​నేతలు కిషన్, దేవేందర్, పిడమర్తి రవి, జీవకన్ టికెట్​ఆశిస్తున్నారు.