ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

భైంసా,వెలుగు: భైంసాలో గణేశ్​నిమజ్జనాన్ని పురస్కరించుకొని పోలీస్​శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. గురువారం ఎస్పీ ప్రవీణ్​కుమార్​తో పాటు ఇద్దరు ఏఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, పది మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, 350 మంది ఏఎస్సైలతో పాటు 500 మంది పోలీసులు బందోబస్తులో పాల్గనున్నారు. ఆరు మొబైల్​ టీంలు, నాలుగు పెట్రోలింగ్, రెండు డ్రోన్  కెమెరాలతో నిఘా పెట్టారు. సుమారు 200 సీసీ కెమెరాలతో పరిస్థితులను సమీక్షించనున్నారు. ఇప్పటికే బాంబ్, డ్వాగ్ స్క్వాడ్​ బృందాలతో శోభాయాత్ర రూట్​లో తనిఖీలు చేశారు.

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్​

నిమజ్జన ఏర్పాట్లను బుధవారం రాత్రి కలెక్టర్ ముషారఫ్​అలీ ఫారూఖీ పరిశీలించారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్​ ఆదేశించారు. ఆయన వెంట ఎస్పీ ప్రవీణ్ కుమార్, అడిషనల్  కలెక్టర్  హేమంత్ బొర్కడే, మున్సిపల్ వైస్ చైర్మన్ జాబిర్​అహ్మద్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, తహసీల్దార్ ​చంద్రశేఖర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కృష్ణ ఉన్నారు. 

నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి

గణేశ్​ నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని ఏఎస్పీ కిరణ్ ఖారే కోరారు. బుధవారం పోలీసులతో కలిసి కవాతు నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్​ నుంచి కప్డాబజార్​, గాంధీగంజ్, బస్టాండ్, తహసీల్దార్​ ఆఫీస్​ మీదుగా కవాతు సాగింది. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మండపాల నిర్వాహకులు ఇన్​టైంలో నిమజ్జనం పూర్తిచేయాలన్నారు. సీఐలు ప్రవీణ్​కుమార్, చంద్రశేఖర్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

నిమజ్జనానికి సహకరించాలి...

నిమజ్జనానికి ప్రతీ ఒక్కరు సహకరించాలని మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్​ సూచించారు. ముస్లింలు ఇన్​టైంలో ప్రార్థనలు చేసుకోవాలన్నారు. పంజేషా మజీద్, ఇతర మార్గాల్లో ఎవరూ ఉండొద్దన్నారు. 

సకాలంలో పూర్తి చేద్దాం

నిమజ్జనం ఇన్​టైంలో పూర్తిచేయాలని హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు విలాస్​ గాదేవార్ సూచించారు. డీజే విషయమై పోలీసులతో చర్చించామని, నాలుగు బాక్సులకు పర్మిషన్​లభించిందన్నారు. తెల్లవారుజాము నాలుగు గంటలోపు నిమజ్జనం పూర్తిచేయాలన్నారు. ఉదయం 9 గంటలకు భట్టీగల్లీ మున్నూరుకాపు సంఘ భవనంలోని వినాయకుడి వద్ద శోభాయాత్ర ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్​రామకృష్ణాగౌడ్, సభ్యులు కొర్వ చిన్నన్న, నగేశ్, గాలి రవికుమార్, పెరుగు నవీన్, దిలీప్, రాజేశ్వర్, కాశీనాథ్, గంగాధర్, సన్నిగౌడ్​ తదితరులు పాల్గొన్నారు. 

వినాయకుని సేవలో వివేక్

మంచిర్యాల, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్​ జి.వివేక్​ వెంకటస్వామి బుధవారం రాత్రి మంచిర్యాలలోని వినాయక మండపాలను సందర్శించారు. స్థానిక విశ్వనాథ ఆలయంలో ఏర్పాటు చేసిన గణేషుడిని, మార్వాడి సమాజ్​ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్​ తదితరులు ఉన్నారు.  

క్రీడలతో మానసికోల్లాసం : కలెక్టర్​  

దండేపల్లి (లక్సెట్టిపేట), వెలుగు: క్రీడలు మానసికోల్లాసానికి ఎంతగానో దోహదపడుతాయని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. బుధవారం లక్సెట్టిపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో ఉమ్మడి జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్​ను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్రీడాస్ఫూర్తిని ప్రతి క్రీడాకారుడు ప్రదర్శించాలని, గెలిచేందుకు కృషి చేయాలని అన్నారు. ఆటల్లో నిబంధనలు పాటిస్తూ ఆడడమే క్రీడాకారుల లక్షణమన్నారు. ఓటమికి కుంగిపోవద్దని, గెలుపు అందరికీ లభించదని చెప్పారు. అపజయం, అనుభవాలను మించిన గురువులు లోకంలో ఎవరూ ఉండరని క్రీడాకారులకు ప్రేరణనిచ్చారు. అంతకుముందు క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పలు మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఆటల్లో తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్​ నలుమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ గౌతమ్ రెడ్డిపాల్గొన్నారు.

వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి

మంచిర్యాల, వెలుగు: వజ్రోత్సవాలను విజయంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్​ భారతి హోళికేరి ఆదేశించారు. బుధవారం సీఎస్​తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్​లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల వారిగా అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. డీసీపీ అఖిల్ మహాజన్, ట్రెయినీ కలెక్టర్ పి.గౌతమి, జడ్పీ సీఈవో నరేందర్, డీఆర్డీవో బి.శేషాద్రి పాల్గొన్నారు.

పశువులను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్ పట్టివేత​

బెల్లంపల్లి,వెలుగు:  కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా బెజ్జూరు నుంచి జగిత్యాల జిల్లా కేంద్రానికి ఆవులను అక్రమంగా తరలిస్తున్న మినీ వ్యాన్​ను బుధవారం బెల్లంపల్లి బీజేపీ బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ కోడి రమేశ్, జనరల్ సెక్రటరీ రాచర్ల సంతోష్  వ్యాన్​ను పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు.  సీఐ  ఎం. రాజు సంఘటనా స్థలానికి చేరుకొని వ్యాన్​ను సీజ్​చేశారు. వ్యాన్​లో ఏడు ఆవులు, రెండు దూడలు ఉన్నట్లు వివరించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిలువకోడురుకు చెందిన వ్యాన్ ఓనర్ సయ్యద్ జావిద్, డ్రైవర్ షేక్ ఫిరోజ్, జగిత్యాల మండలం కురానిపేట గ్రామానికి చెందిన ఎస్​కే ఖలీద్​పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మేకల సంతోష్​వివరించారు.

సింగరేణిలో బీసీ చీఫ్​ లైజన్ ఆఫీసర్లను ​ నియమించాలి

మందమర్రి,వెలుగు: సింగరేణి వ్యాప్తంగా ప్రతీ ఏరియాలో  బీసీ ఉద్యోగులు అసోసియేషన్​, చీఫ్ లైజన్​ఆఫీసర్​ను నియమించుకోవడానికి యాజమాన్యం పర్మిషన్​ ఇవ్వాలని సింగరేణి బ్యాక్వర్డ్ క్లాసెస్​అసోసియేషన్​ ప్రెసిడెంట్​ పి.శ్రీనివాస్ కోరారు. బుధవారం ఏరియా సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్​ను బీసీ ఉద్యోగులు, ఆఫీసర్లు కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఇతర అసోసియేషన్లు కేటాయించిన మాదిరిగా బీసీ అసోసియేషన్​ ఆఫీస్​ కోసం క్వార్టర్​ను కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో కేకే ఓసీపీ, ఆర్కేపీ ఓసీపీ పీవోలు రమేశ్, మధుసూదన్, కాసిపేట గ్రూప్ ఏజెంట్​రాజేందర్, కేకే5, ఆర్కే1ఏ, కాసిపేట2 గనుల మేనేజర్ భూశంకరయ్య, శ్రీధర్​రావు, రవీందర్​ తదితరులు పాల్గొన్నారు. 

బిల్లులు ఇవ్వడంలేదని టీఆర్ఎస్ లీడర్​ ధర్నా​

కాగజ్ నగర్,వెలుగు: చేసిన పనుల బిల్లులు ఇవ్వడంలేదని టీఆర్ఎస్ లీడర్​ఒకరు బుధవారం ధర్నాకు దిగారు. చింతలామానేపల్లి మండల కేంద్రానికి చెందిన రామగోని నీలాగౌడ్ ఎంపీపీ నానయ్య కలిసి రెండు స్కూళ్ల బిల్డింగ్ పనులు చేశారు. ఎంపీపీ స్కూల్ హెచ్ఎంతో కుమ్మక్కు అయి కనీసం నోటీసు ఇవ్వకుండా బిల్లు కాజేశారని నీలాగౌడ్​ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు ఎంపీపీని అడిగినా పట్టించుకోలేదన్నారు. పైపెచ్చు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తానని స్పష్టం చేశారు. ఈ విషయమై హెచ్ఎం దేవాజీని వివరణ కోరగా పెండింగ్ లో ఉన్న స్కూల్ బిల్డింగ్ పనులు ఎంపీపీ పూర్తిచేయించారని, ఆర్వీఎం ఇంజినీరింగ్​ఆఫీసర్ల సూచన మేరకు నానాయ్యకే తీర్మానం చేసి బిల్లు ఇచ్చినట్లు వివరించారు.

నిఘా నీడలో నిమజ్జన శోభాయాత్ర 

మంచిర్యాల, వెలుగు: గణేశ్​ నిమజ్జన శోభాయాత్ర శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని రామగుండం పోలీస్ కమిషనర్  ఎస్.చంద్రశేఖర్​రెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని, టపాకాయలు కాల్చరాదని, మద్యం తాగి వాహనాలు నడపరాదని, రూల్స్​ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, అవసరం అనుకుంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. శోభయాత్ర సందర్భంగా జిల్లాలోని వైన్ షాపులను మూసివేయాలని, ఎవరూ రాజకీయ ప్రసంగాలు, నినాదాలు చేయరాదని అన్నారు.  

మట్టి గణపతులకు బహుమతులు  ఇవ్వాలి..

నవరాత్రుల ముగింపు సందర్భంగా మట్టి ప్రతిమలను ఉత్తమ గణపతులుగా ప్రకటించి బహుమతులు అందించాలని పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్, వెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ముడుపు రాంప్రకాశ్​ రామగుండం సీపీ చంద్రశేఖర్​రెడ్డిని కోరారు. బుధవారం రామగుండంలోని సీపీని కలిసి మెమోరాండం అందజేశారు.  

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం

నిర్మల్, వెలుగు: టీఆర్ఎస్​ పార్టీ 57 ఏళ్లకే పెన్షన్​ఇస్తామన్న హామీని నిలబెట్టుకుందని మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి చెప్పారు. బుధవారం సోన్​, లక్ష్మణచాంద మండలం వడ్యాల్ లో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్​కార్డులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వాలు పేదల అభ్యున్నతిని పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ మనసున్న వ్యక్తన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ లీడర్లు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్​ అలీ ఫారూఖీ, అడిషనల్ కలెక్టర్ హేమంత్​ బోర్కడే, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్​ రెడ్డి, ఎంపీపీ పద్మ రమేశ్, సర్పంచ్​లలితా రాంరెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

ఫీజు రీయింబర్స్​మెంట్​ రిలీజ్​ చేయాలి

మంచిర్యాల, వెలుగు: పెండింగ్​లో ఉన్న ఫీజు రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్​లను వెంటనే రిలీజ్​ చేయాలని పీడీఎస్​యూ రాష్ర్ట అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఈ మేరకు బుధవారం మంచిర్యాలలో ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్​ను ముట్టడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్​మెంట్​పై 13.50 లక్షల మంది విద్యార్థులు ఆధారపడ్డారని, వారికి రూ.3,375 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఇంజనీరింగ్ ఫీజులు పెంచుకోమని పరోక్షంగా ప్రభుత్వమే  ప్రోత్సహించిందని, దీంతో పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉందని అన్నారు. కార్పొరేట్​ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని డిమాండ్​ చేశారు.

ఉద్రిక్తతల నడుమ ముగిసిన గణనాథుడి నిమజ్జనం

భైంసా, వెలుగు: ముథోల్​లో మంగళవారం రాత్రి పోలీసులకు, గణేశ్​ మండళ్ల నిర్వాహకులకు మధ్య జరిగిన స్వల్ప ఘర్షణలో గణేశ్​నిమజ్జనం నిలిచిపోయింది. ఏడు రోజులకు నిమజ్జనం జరగాల్సి ఉండగా.. పోలీసుల తీరును నిరసిస్తూ వారు తొమ్మిది రోజులకు చేశారు. బుధవారం గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు స్థానిక పశుపతి నాథ్​ ఆలయం వద్ద మీటింగ్​ నిర్వహించారు. సర్పంచ్ ​రాజేందర్, ఎంపీటీసీ భూమేశ్, మాజీ సర్పంచ్​అనిల్, గ్రామ పెద్దలు రోళ్ల రమేశ్, పోతన్న యాదవ్, బీజేపీ లీడర్లు నారాయణ్​రెడ్డి, రవిపాండే, గోపాల్​ సార్డాలు యువకులను సముదాయించారు. డిమాండ్లను పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పడంతో శాంతించారు.

క్రీడలతోనే మానసిక ఉల్లాసం

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని, ఆటలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని ఎమ్మెల్యే జోగు రామన్న చెప్పారు. బుధవారం ఆయన స్థానిక న్యూహౌసింగ్​బోర్డులోని మహాత్మ జ్యోతిరావు పూలే స్కూల్​లో ఉమ్మడి జిల్లా క్రీడలు ప్రారంభించారు. ఈనెల 9 వరకు పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ రిజ్వాన్​ బాషా, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పాల్గొన్నారు.

కర్ర గణేశ్​ను దర్శించుకున్న ముస్లిం కుటుంబం

భైంసా/లోకేశ్వరం,వెలుగు: భైంసా మండలం మాటేగాం, మహారాష్ట్రలోని పాలజ్​ కర్ర వినాయకులను బుధవారం రెండు ముస్లిం కుటుంబాలు దర్శించుకున్నాయి. కుంటాల మండలం కల్లూర్​కు చెందిన ఓ కుటుంబం మాటేగాం కర్ర వినాయకుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంది. లోకేశ్వరం మండలం మన్మథ్​ గ్రామానికి చెందిన ఎస్​కే మక్బూల్​ స్నేహితులతో కలిసి సుమారు 50 కిలోమీటర్లు పాదయాత్రగా పాలజ్​కు వెళ్లి వినాయకుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

రానున్నది బీజేపీ సర్కారే

భైంసా,వెలుగు: రాష్ట్రంలో రానున్నది బీజేపీ సర్కారే అని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​రావు పటేల్ చెప్పారు. బుధవారం ఆయన మాటేగాం, పాలజ్​లో వినాయకులను దర్శించుకొని మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్​ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని పాలన సాగిస్తోందన్నారు. అనర్హులు, టీఆర్ఎస్ లీడర్ల బంధువులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆసరా పెన్షన్లు మంజూరు చేయడం సరికాదన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషిచేస్తామన్నారు. కాగా.. ఆయా గణేశ్​మండళ్ల ఆధ్వర్యంలో మోహన్​రావు పటేల్​ను సన్మానించారు. ఆయన వెంట లీడర్లు రామకృష్ణ, దిలీప్, బాజనోళ్ల సాయినాథ్​ తదితరులు ఉన్నారు.