
- ముఖ్యమంత్రికి భద్రత మరింత పెంపు
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి నేపథ్యంలో ఢిల్లీ పోలీసు కమిషనర్ శశిభూషణ్ కుమార్ (ఎస్ బీకే) సింగ్ స్థానంలో 1992 బ్యాచ్ ఐపీఎస్ సతీశ్ గోల్చాను నియమించారు. హోం గార్డ్స్ డైరెక్టర్ జనరల్ గా కూడా వ్యవహరిస్తున్న ఎస్ బీకే సింగ్ కు ఇటీవలే ఢిల్లీ కమిషనర్ గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఈ నెల 1న ఆయన బాధ్యతలు చేపట్టారు. అయితే, బుధవారం సీఎంపై దుండగుడి దాడి నేపథ్యంలో కమిషనర్ ను మార్చారు. 1988 బ్యాచ్ ఐపీఎస్ అయిన ఎస్ బీకే సింగ్ స్థానంలో సతీశ్ గోల్చాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఢిల్లీ పోలీసు విభాగంలో గోల్చా వివిధ హోదాల్లో పనిచేశారు. 2020లో ఈశాన్య ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక అల్లర్లు జరిగినపుడు స్పెషల్ కమిషనర్ గా ఉన్నారు. నిరుడు ఏప్రిల్ లో జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. కాగా, సీఎం రేఖా గుప్తాపై దాడి నేపథ్యంలో ఆమెకు కల్పిస్తున్న ‘జడ్ ప్లస్’ సెక్యూరిటీని మరింత పెంచారు. ఆమె భద్రతా సిబ్బందిలో సీఆర్పీఎఫ్ కమాండోలను కూడా చేర్చారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.