ఏసీబీ అధికారుల రాక చూసి..లంచం డబ్బు 5 లక్షలు కాల్చివేత

ఏసీబీ అధికారుల రాక చూసి..లంచం డబ్బు 5 లక్షలు కాల్చివేత
  • గ్యాస్ స్టౌ మీద మంటలో డబ్బులు కాల్చుతుండగా తలుపులు బద్దలు కొట్టి అడ్డుకున్న అధికారులు

నాగర్ కర్నూల్:  లంచంగా తీసుకున్న రూ.5లక్షల డబ్బు కోసం ఏసీబీ అధికారులు రావడం గుర్తించి.. వారికి పట్టుబడకుండా ఉండేందుకు గ్యాస్ స్టౌ మంటల్లో డబ్బు తగలబెట్టేందుకు విఫలయత్నం చేసిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జరిగింది. తమను లోపలికి రానివ్వకుండా తలుపులు మూసేయడంతో బద్దలుకొట్టి లోపలికి వెళ్లిన ఏసీబీ అధికారులకు గ్యాస్ స్టౌ మంటలో డబ్బులు కాల్చుతుండగా అడ్డుకున్నారు. అప్పటికే 30 శాతం నోట్లు కాలిపోయాయి. సంచలనం సృష్టించిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామం వద్ద 35 ఎకరాల్లో  మైనింగ్ అనుమతి కోసం రమావత్ రాములు నాయక్ దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి ఎన్ఓసీ (NOC) ఇచ్చేందుకు వెల్దండ తహసిల్దార్ సైదులు రూ.6 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వివరాలు ఆరా తీశారు. తాహశీల్దార్ కు ఇచ్చేందుకు ఏసీబీ అధికారులు రూ.5లక్షలు బాధితుడికి ఇచ్చారు. అయితే లంచం డబ్బు నేరుగా తీసుకునేందుకు ఇష్టపడని తాహశీల్దార్ సైదులు తనకు మధ్యవర్తిగా వ్యవహరించిన వెల్దండ మాజీ మండలాధ్యక్షుడు వెంకటయ్య గౌడ్ వద్దకు వెళ్లి ఆయనకే ఇవ్వాలని సూచించారు. తాహశీల్దార్ సూచన మేరకు కల్వకుర్తిలోని విద్యానగర్ లో మాజీ ఎంపీపీ వెంకటయ్య గౌడ్ ఇంటికి వెళ్లి రూ. 5 లక్షలు లంచం డబ్బులు ఇచ్చి వెనుతిరిగి వస్తుండగా ఏసీబీ అధికారులు తాహశీల్దార్ కార్యాలయంలో దాడి చేశారు. మరో బృందం అధికారులు మాజీ ఎంపీపీ వెంకటయ్య గౌడ్ ఇంటికి వచ్చారు. అయితే ఈ విషయం ఎలా పసిగట్టాడో గాని ఏసీబీ అధికారుల రాకను పసిగట్టి అప్రమత్తమైన మాజీ ఎంపీపీ వెంకటయ్య గౌడ్.. ఇంటి తలుపులు మూసేశారు. ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నా వినిపించుకోకుండా కిచెన్ లో గ్యాస్ స్టౌ మంటపై లంచం డబ్బు 5 లక్షల రూపాయలు తగలబెట్టడం ప్రారంభించాడు. ఏసీబీ అధికారులు తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి వెళ్లగా.. గ్యాస్ స్టౌ పై డబ్బులు తగలబెట్టడం కనిపించింది. వెంటనే అడ్డుకుని నివారించారు.అప్పటికే 30 శాతం నోట్లు తగలబడిపోయాయి. ఈ మేరకు కేసు నమోదు చేశారు.