స్థానిక ఎన్నికల్లో బీసీల గొంతు కోసింది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్సే : మంత్రి సీతక్క

స్థానిక ఎన్నికల్లో బీసీల గొంతు కోసింది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్సే : మంత్రి సీతక్క
  • గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించింది: మంత్రి సీతక్క
  • 2019లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ వచ్చాక 22 శాతానికి తగ్గించింది
  • ఈ అన్యాయాన్ని బీసీలు ఎప్పటికీ మర్చిపోరు 
  • బీసీలకు 42 % సీట్లు ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమా? అని కేటీఆర్​కు సవాల్​

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం 17 శాతానికి తగ్గించిందన్న కేటీఆర్ ఆరోపణలు పూర్తిగా అసత్యమని మంత్రి సీతక్క అన్నారు. బీసీ రిజర్వేషన్లపై ​అసత్య ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. ‘ప్రభుత్వపరంగా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం చేస్తూనే.. పార్టీపరంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమా?’ అని కేటీఆర్​కు సీతక్క సవాల్ విసిరారు. 

గురువారం ప్రజాభవన్​లో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చిత్తశుద్ధితోనే కులగణన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేసిందన్నారు. 2014కు ముందు జరిగిన స్థానిక ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించిందని, 2019లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించి బీసీల గొంతు కోసిందని ఆమె ఫైర్​అయ్యారు. 

ఈ అన్యాయాన్ని బీసీలు ఎప్పటికీ మర్చిపోరన్నారు. 2019 స్థానిక ఎన్నికల్లో రాష్ట్రం యూనిట్ గా సర్పంచ్​ల రిజర్వేషన్లను బీఆర్ఎస్ ఖరారు చేయగా.. ఆ విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సర్పంచ్ రిజర్వేషన్లకు మండల యూనిట్ గా, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు గ్రామపంచాయతీ యూనిట్​గా పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తప్పనిసరిగా పాటించాల్సి వచ్చిందన్నారు. 

కుల గణనను అడ్డుకున్నదెవరో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్  చెప్పాలి..

కుల గణనను అడ్డుకున్నది.. రిజర్వేషన్లపై అడ్డంకులు సృష్టించింది ఎవరన్న ప్రశ్నలకు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ సమాధానం చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్​ చేశారు. కొన్ని మండలాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉండటంతో ఆ పరిమితిని దాటిపోకుండా ఉండేందుకు బీసీ రిజర్వేషన్లలో కొంతమార్పు జరిగిందన్నారు.  స్థానిక ఎన్నికలు ఆలస్యమైతే, కేంద్రం నుంచి రావాల్సిన రూ.3వేల కోట్లు నిలిచిపోతాయని, గ్రామాల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. 

బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. బీసీల మంచిని కోరుకునే పరిస్థితిలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ లేదని, ఆ పార్టీ నేతలు కులగణనలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పాల్గొనలేదని   గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లు నిలిచిపోవాలని కోర్టుల్లో అడ్డంకులు సృష్టించిన పార్టీ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్సేనని ఆమె పేర్కొన్నారు. భద్రాచలం, ములుగు, ఆదిలాబాద్ వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో పీసా చట్టం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జనాభా ప్రాతిపదికన 100శాతం గిరిజనులకు రిజర్వేషన్ల కేటాయించారన్నారు.  

కొత్తగా ఏర్పడిన తండాలు, గూడేలు గ్రామపంచాయతీలుగా మారడంతో గిరిజన సీట్ల సంఖ్య సహజంగా పెరిగిందని తెలిపారు. “కేటీఆర్ గుర్తుంచుకోండి.. అసత్య ప్రచారాలు ఎక్కువకాలం నిలవవు. నిజం మాత్రం చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగానే మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది” అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.