మక్తల్/మాగనూర్, వెలుగు: నారాయణపేట జిల్లాలో సీఎంఆర్(కస్టమ్మిల్లుడ్ రైస్) వడ్లను మాయం చేసిన ఆరు రైస్మిల్లులను అధికారులు సోమవారం సీజ్చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఆనందం జిల్లాలోని పలు రైస్ మిల్లులను తనిఖీ చేయగా 2లక్షల78వేల433 బస్తాలు మాయం అయినట్లు తేలింది. మాగనూర్ ఉమర్ రైస్ మిల్లులో 70,702 వడ్ల బస్తాలకు గాను, 6 వేల బస్తాలు, మల్లికార్జున రైస్ మిల్లులో 97,639 బస్తాలకు గాను 76 వేల బస్తాలు, మక్తల్ లోని స్టార్ రైస్ మిల్లులో 99,903 బస్తాలకు గాను 45 వేల బస్తాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. అలాగే లిమ్రా రైస్ మిల్లులో 47,918 బస్తాల్లో ఒక్కటి కూడా లేదని తేల్చారు.
తెలంగాణ రైస్ మిల్లులో 62,540 బస్తాలకు గాను 45 వేల బస్తాలు మాత్రమే ఉన్నట్లు, మరికల్ మండలం లాల్ కోట క్రాస్ లోని వెంకటేశ్వర రైస్ మిల్లులో 71,733 వడ్ల బస్తాల్లో ఒక్క బస్తా కూడా లేదని గుర్తించారు. ఈ ఆరు మిల్లులను సీజ్ చేసి, కేసులు నమోదు చేసినట్లు డిప్యూటీ తహసీల్దార్ఆనందం తెలిపారు. ఆయన వెంట సివిల్ సప్లై డీటీ గురురాజారావు, ఆర్ఐ కళప్ప ఉన్నారు.

