అర్హుల ఓటు తొలగించకుండా చూడాలి... కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి పిలుపు

అర్హుల ఓటు తొలగించకుండా చూడాలి... కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి పిలుపు

నల్గొండ, వెలుగు:  అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ (బీఎల్ఏ) అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని కోరారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఇంటింటి ఓటర్ల గణనలో శ్రేణులు చురుగ్గా పాల్గొని, ఓటర్ల జాబితాలోని లోపాలను సరిచేయాలని సూచించారు. 

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించబడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌‌‌‌చార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణను తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో ఓటమి బూత్ స్థాయిలో నిర్లక్ష్యం వహించిన రోజే ప్రారంభమవుతుందని, ఒక్క కాంగ్రెస్ ఓటు కూడా వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్ఏలదేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో  టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ ఎస్ఐఆర్ చైర్మన్, ఎమ్మెల్యేలు డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ఈ నెల 17న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వెల్లడించారు. జిల్లాలోని కనగల్ మండల కేంద్రంలో ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రూ. 14 వేల కోట్లతో హ్యామ్​  పద్ధతిలో చేపట్టనున్న డబుల్ రోడ్ల నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. శనివారం ఆయన అధికారులతో కలిసి హెలిప్యాడ్, బహిరంగ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఒకే రోజు 34 ప్యాకేజీల ద్వారా 6,300 కిలోమీటర్ల రోడ్ల పనులను ప్రారంభిస్తున్నామని, ఇందులో మొదటి ప్యాకేజీ కనగల్ నుంచి డిండి వరకు ఉంటుందని వివరించారు. 

రూ. 450 కోట్లతో ఏఆర్పీ కాలువల లైనింగ్ పనులు, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తాగునీటి ప్రాజెక్టులకు కూడా సీఎం అదే రోజు శంకుస్థాపన చేస్తారన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేసే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 2028 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. సుమారు లక్ష మంది హాజరయ్యే ఈ బహిరంగ సభకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్​ కలెక్టర్లు జె. శ్రీనివాస్, వై. అశోక్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేశ్​ ఉన్నారు.