
- ఇప్పటివరకు 46 వేల మంది దివ్యాంగుల గుర్తింపు
- ఒక్కో సంఘంలో 5 నుంచి 15 మంది వరకు సభ్యులు
- బుక్ కీపింగ్‌పై ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రణాళికలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దివ్యాంగుల సాధికారత, వారి సంక్షేమానికి ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దివ్యాంగుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ఎస్‌హెచ్‌జీల తరహాలో పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తోంది. ఈ సంఘాలతో దివ్యాంగులకు పొదుపును అలవాటు చేయడంతోపాటు ప్రభుత్వ పథకాలు అందించి.. రుణ సదుపాయం, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18 వేల దివ్యాంగుల సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో 46 వేల మంది దివ్యాంగులను గుర్తించి సంఘాల ఏర్పాటును స్పీడప్ చేశారు. దివ్యాంగులు ఉన్న ప్రతి గ్రామం, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించారు. ప్రస్తుతం గుర్తించిన దివ్యాంగులతో బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయిస్తున్నారు. కొత్త సంఘాలను ఆన్లైన్ చేస్తున్నారు. సంఘాలతో కలిగే ప్రయోజనాలు, మీటింగ్ నిర్వహణ, బుక్ కీపింగ్‌పై అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కనీసం ఐదుగురు సభ్యులు ఉండేలా..
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాలు విజయవంతంగా నడుస్తుండటంతో ఇదే తరహాలో దివ్యాంగుల సంఘాలను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. సంఘంలో ఐదు నుంచి 15 మంది సభ్యులు ఉండేలా చూస్తున్నారు. సంఘంలో చేరేందుకు ఆధార్ కార్డు, స్థానిక చిరునామా తప్పనిసరి చేశారు. గ్రామాల్లో సెర్ప్, పట్టణ ప్రాంతాల్లో మెప్మా సిబ్బంది సహాయం పొందవచ్చని, కనీసం రూ.50 నుంచి రూ.500 వరకు ఎంతైనా పొదుపు చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, దివ్యాంగులకు బ్యాంకు పని విషయంలో ఇతరుల సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకుకు వెళ్లి డబ్బులు వేయడం, డ్రా చేయడం వంటి విషయాల్లో వారికి ఇతరుల సహాయం అవసరం ఉంటుంది.
ఈ క్రమంలో ఏం చేయాలనేదానిపై తర్జన భర్జన పడిన అధికారులు.. బుక్ కీపర్ల ద్వారా బ్యాంకు లావాదేవి జరపాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బ్యాంకు లావాదేవీలు జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. దివ్యాంగులు సమావేశాలకు వెళ్లి రావాలంటే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి జూమ్‌ద్వారా మీటింగ్ పెట్టుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
స్మార్ట్‌ఫోన్ ఉంటే వారు ఎక్కడి నుంచైనా సమావేశానికి హాజరయ్యేలా అవకాశం కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. కాగా, ఈ సంఘాలు దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలువనున్నాయి. ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందడంతో పాటు స్వశక్తిని పెంపొందిస్తాయని సామాజికంగా గుర్తింపు లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. అయితే, సంఘాల ద్వారా విజయవంతంగా పొదుపు చేస్తే ఆయా సంఘాలకు ప్రభుత్వం రివాలింగ్ ఫండ్ ఇవ్వనున్నది. దీని ద్వారా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.