హైదరాబాద్ మార్కెట్ల సెల్ఫ్ లాక్​డౌన్

హైదరాబాద్ మార్కెట్ల సెల్ఫ్ లాక్​డౌన్
  • రేపటి నుంచి జులై 5 వరకు ప్రధాన మార్కెట్లన్నీ క్లోజ్​
  • ఇప్పటికే మూతపడ్డ జనరల్​ బజార్​, లాడ్​ బజార్​
  • పలు జిల్లాల్లోనూ షట్​డౌన్​.. కరోనా కట్టడిపై సీఎం సమీక్షలు బంద్
  • గ్రేటర్​లో 50వేల టెస్టులని చెప్పి.. 20వేలే చేశారు!

రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో మార్కెట్లు, షాపులు సెల్ఫ్​ లాక్​డౌన్​లోకి వెళ్తున్నాయి. ఎక్కడి నుంచి, ఎవరి నుంచి, ఎలా వైరస్​ అంటుకుంటుందోనని వ్యాపారులు భయపడుతున్నారు. ఇదే టైంలో ప్రభుత్వం టెస్టులు చేయడం కూడా ఆపేయడం మరింత ఆందోళనకు దారితీసింది. దీంతో హైదరాబాద్​, సికింద్రాబాద్​లోని ప్రధాన మార్కెట్లన్నీ మూతపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని మార్కెట్లు మూతపడగా.. దాదాపు మిగతా మార్కెట్లన్నీ ఆదివారం నుంచి జులై 5 వ‌‌ర‌‌కు బంద్​ కానున్నాయి.

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లోని ప్రధాన మార్కెట్లు స్వచ్ఛంద బంద్​ పాటిస్తున్నాయి. కరోనా వ్యాప్తి తీవ్రమవుతుండటంతో వ్యాపారులు సెల్ఫ్ లాక్​ డౌన్ అమలు చేస్తున్నారు. సికింద్రాబాద్‌‌ జనరల్ బజార్‌‌, సూర్యా టవర్స్‌‌, ప్యారడైజ్‌‌ ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని షాపులు క్లోజ్​ అయ్యాయి. జులై 5 వరకు స్వచ్ఛందంగా లాక్‌‌డౌన్‌‌ పాటిస్తున్నట్లు గోల్డ్‌‌ అండ్‌‌ సిల్వర్‌‌ మర్చంట్‌‌ అసోసియేషన్‌‌, హైదరాబాద్​ కిరాణ మార్చంట్​అసోసియేషన్లు ప్రకటించాయి. శుక్రవారం నుంచి చార్మినార్​లోని లాడ్​ బజార్​ బందైంది. తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద ఎలక్ట్రికల్‌‌ మార్కెట్‌‌ ట్రూప్‌‌ బజార్‌‌ కూడా శనివారం నుంచి వచ్చే నెల 5 వరకు మూతపడనుంది.

మూడ్రోజులు హోల్​సెల్​ మెడికల్​ షాపులు బంద్​

హోల్ సేల్ మెడిసిన్స్​ అమ్మకాలకు పేరొందిన హైదరాబాద్​లోని ఇంద్రబాగ్ వ్యాపారులు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు తమ వ్యాపారాలను మూసి వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28 వరకు ఎలాంటి అమ్మకాలు ఉండవని, ఎవరూ కొనుగోళ్లకు రావొద్దని ఇంద్రబాగ్​ మెడికల్ ట్రేడర్స్ అసోసియేషన్ సూచించింది.

రేపటి నుంచి బేగంబజార్, రాణిగంజ్​ లాక్​

హైదరాబాద్​లోని బేగంబజార్, రాణిగంజ్​ మార్కెట్లు ఆదివా రం నుంచి మూతపడనున్నాయి. బేగంబజార్‌‌లో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక్కడ సుమారు 700 హోల్‌‌సేల్‌‌ షాపులు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో చిన్నాచితక వ్యాపారులు వస్తుంటారు. దీంతో వైరస్​ వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున ఈ నెల 28 నుంచి జులై 5 వరకు పూర్తిగా మూసివేయనున్నారు. బేగంజజార్‌‌ మార్కెట్‌‌ పరిధిలోకి వచ్చే కిషన్‌‌గంజ్, మహారాజ్‌‌గంజ్‌‌, బర్తన్‌‌ బజార్‌‌ తదితర మార్కెట్లు కూడా బంద్​ కానున్నాయి. సికింద్రాబాద్​లోని రాణిగంజ్ మార్కెట్‌‌లో కూడా వ్యాపారులు సెల్ఫ్​ లాక్‌‌డౌన్ పాటించనున్నారు.

ఆదివారం నుంచి 8 రోజుల పాటు రాణిగంజ్ హ‌‌‌‌బ్‌‌‌‌లోని 5 వేల షాపులు బంద్ కానున్నాయి. నాంపల్లిలోని ఫర్నిచర్స్ షాప్స్ అన్నీ స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. శుక్రవారం నుంచి జులై 5 వరకు సెల్ఫ్​ లాక్​ డౌన్​ పాటిస్తున్నట్లు తెలంగాణ ఫర్నిచర్స్ మ్యానిఫెక్చర్స్ అండ్​ డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఉస్మాన్​గంజ్​ మార్కెట్​ఇక రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది.

జగదీశ్​ మార్కెట్​ క్లోజ్​?

సెల్​ఫోన్లకు కేరాఫ్​గా ఉన్న హైదరాబాద్​లోని జగదీశ్​ మార్కెట్​ కూడా బందయ్యే అవకాశాలున్నాయి. శనివారం జగదీశ్​ మార్కెట్​ అసోసియేషన్​ బోర్డు నిర్ణయం తీసుకోనుంది. సోమవారం నుంచి వారంపాటు జగదీశ్​ మార్కెట్​లో సెల్ఫ్​ లాక్​ డౌన్​ పాటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

జిల్లాల్లోనూ బంద్

  • జిల్లాల్లోనూ కేసులు పెరుగుతుండటంతో అక్కడి వ్యాపారులు సెల్ఫ్​ లాక్​డౌన్​ అమలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఊళ్లలో, పట్టణాల్లో షాపులను, వ్యాపారాలను బంద్​ చేశారు. కొన్ని ప్రాంతాల్లో కొంత టైం వరకు మాత్రమే షాపులను తెరుస్తున్నారు.
  • పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కిరాణ షాపులను ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే తెరుస్తున్నారు. మధ్యాహ్నం 2 తర్వాత తెరిచి ఉంచిన వారికి వర్తక సంఘం రూ. 5వేల ఫైన్​ వేస్తోంది.
  • కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని గర్షకుర్తి, వీణవంక మండలంలోని వల్బాపూర్ గ్రామాలు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకున్నాయి. జనగామ టౌన్​మొత్తం శుక్రవారం నుంచి స్వచ్ఛంద లాక్ డౌన్ పాటిస్తోంది. కిరాణ, వైన్స్, మెడికల్ షాపులు మాత్రమే ఓపెన్ ఉంటున్నాయి. ఈ నెల 30 వరకు ఇది అమల్లో ఉండనుంది.
  • కామారెడ్డి జిల్లా సదాశివనగర్, పద్మాజివాడీ ఎక్స్​రోడ్డులో రెండ్రోజుల నుంచి సెల్ఫ్​ లాక్​డౌన్​ కొనసాగుతోంది. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని జూలూరులో ఒక పాజిటివ్​ కేసు రావడంతో మూడ్రోజుల నుంచి అక్కడ షాపులు బంద్ చేశారు.
  • సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని తంగళ్ళపల్లిలో ఒకరికి కరోనా రావడంతో వారం నుంచి ఊరోళ్లంతా సెల్ఫ్ లాక్ పాటిస్తున్నారు. కోహెడ తోపాటు సిద్దిపేట టౌన్​లో షాపులను సాయంత్రం ఆరింటి వరకు మాత్రమే తెరిచి ఉంచుతున్నారు.
  • సంగారెడ్డి జిల్లాలో మునిపల్లి, మేళా సంఘం, కంకోల్, దౌల్తాబాద్ గ్రామాలు సెల్ఫ్​ లాక్​డౌన్ విధించుకున్నాయి. షాపులను మధ్యాహ్నం 12 గంటల వరకే తెరిచి ఉంచుతున్నారు.
  • నల్గొండ పట్టణంలో 6 గంటలకి షాపులు మూసేయాలని వస్త్ర వ్యాపారులు తీర్మానం చేసుకున్నారు. నకిరేకల్ లో రెండు కేసులు రావడంతో మెయిన్ రోడ్డు, మూసీ రోడ్డులో మూడ్రోజుల నుంచి అన్ని షాపులను సాయంత్రం ఐదు గంటలకే క్లోజ్​ చేస్తున్నారు.
  • జగిత్యాల, మంచిర్యాల జిల్లా కేంద్రాల్లో శుక్రవారం నుంచి సాయంత్రం 6 గంటలకే క్లోజ్​చేస్తున్నారు. మందమర్రిలో మధ్యాహ్నం రెండింటి వరకే షాపులను తెరిచి ఉంచుతున్నారు.
  • వరంగల్ బీట్ బజార్ లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకే షాప్ లు తెరుస్తున్నారు. హన్మకొండ లోని సెలూన్ షాపు లు జులై 1 వరకు క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆసిఫాబాద్​లో శనివారం జరగనున్న సంతను రద్దు చేశారు.
  • కొత్తగూడెం పట్టణంలో సాయంత్రం 5 కే షాపులు క్లోజ్​చేసేలా వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు.
  • రాజన్నసిరిసిల్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4గంటల వరకే షాపులు తెరిచి ఉంటాయని పెద్ద బజార్ కిరాణ వర్తక సంఘం తెలిపింది.
  • జనగామ జిల్లా కేంద్రంలోనూ ఈ నెల 30 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు తెరిచి ఉంచాలని చెప్పారు.

కేసులు పెరుగుతున్నయని​…

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నయి. బేగంబజార్​లో పనిచేస్తున్న వారికి కూడా పదుల సంఖ్యలో కరోనా అంటింది. దీంతోముందస్తు జాగ్రత్తగా సెల్ఫ్​ లాక్​ డౌన్​ విధించాలని నిర్ణయం తీసుకున్నం.
– లక్ష్మీ నారాయణ్​ రాఠీ, బేగంబజార్​ కిరాణ మర్చంట్​ ప్రెసిడెంట్, హైదరాబాద్​

అందరూ బాగుండాలని…

లాక్​ డౌన్​ తర్వాత మార్కెట్​కు వస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఎవరిలో వైరస్​ ఉందో అర్థం కానీ పరిస్థితి. మాతో పాటు మార్కెట్లో పనిచేసే ప్రతి ఒక్కరూ బాగుండాలని బంద్​ పాటిస్తున్నం.
– వి.ఎస్​ జనార్దనమూర్తి, రాణిగంజ్​ మర్చంట్​ వెల్ఫేర్‌​ అసోసియేషన్​ ప్రెసిడెంట్, సికింద్రాబాద్​

రాష్ట్రంలో ప్రైవేట్ ల్యాబ్ ల టెస్టుల్లో తప్పులు