PSL 2024: మాలిక్‌పై మాజీ క్రికెటర్ విమర్శలు.. వాడీవేడిగా పాక్ సూపర్ లీగ్

PSL 2024: మాలిక్‌పై మాజీ క్రికెటర్ విమర్శలు.. వాడీవేడిగా పాక్ సూపర్ లీగ్

ఐపీఎల్‌కు పోటీగా పాక్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తోన్న పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. శనివారం(ఫిబ్రవరి 17) డిఫెండింగ్‌ ఛాంపియన్‌ లాహోర్‌ ఖలాండర్స్‌, ఇస్లామాబాద్‌ యూనైటెడ్‌ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌తో టోర్నీ మొదలైంది. ఏ ముహూర్తాన ఈ టోర్నీ మొదలుపెట్టారో కానీ, రోజుకో విమర్శ తెరమీదకు వస్తోంది. తొలి మ్యాచ్‌లో వ్యతిరేక ఫలితం రావడంతో పీఎస్‌ఎల్ టోర్నీ ఫిక్సింగ్ అంటూ విమర్శలు వచ్చాయి. తాజాగా, సరైన ప్రదర్శన చేయనందుకు షోయబ్ మాలిక్‌పై ఆ దేశ మాజీ విమర్శలు ఎక్కుపెట్టారు.

ఆదివారం(ఫిబ్రవరి 19) ముల్తాన్ సుల్తాన్స్, కరాచీ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రీజా హెండ్రిక్స్ (79; 54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోర్‍గా నిలవగా.. డేవిడ్ మలన్ 41 బంతుల్లో 52 పరుగులు చేశాడు. అనంతరం ఛేదనలో కరాచీ జట్టు 130 పరుగులకే పరిమితమైంది. కింగ్స్ బ్యాటర్లలో షోయబ్ మాలిక్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 150కి పైగా స్ట్రైక్ రేట్‌తో 35 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. అయినప్పటికీ.. అతనిపై విమర్శలు ఆగ లేదు.

స్వార్థం.. గెలవాలన్న కసి లేదు

షోయబ్ మాలిక్ స్వార్థపూరిత ఆటగాడని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ఆరోపించాడు. అతను వేగంగా పరుగులు చేయకపోవడంతోనే కరాచీ జట్టు ఓటమిపాలైందని విషం వెళ్లగక్కాడు.

మాలిక్‌కు అభిమానుల మద్దతు

మాలిక్‌ను విమర్శించిన అబ్దుల్ రజాక్‌పై సొంత దేశ అభిమానులూ మండిపడుతున్నారు. జట్టంటే.. ఒక్క ఆటగాడు కాదని, 11 మంది రాణించాలని అతనికి తగిన బుద్ధి చెప్తున్నారు. మరికొందరు 'ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నావ్.. బుద్దిగా కాపురం చేసుకోక ఈ ఆటలేంది..' అని అతన్ని ప్రశ్నిస్తున్నారు. వెళ్లి  కాపురం చేసుకోమని చెప్పడం వారి ఉద్దేశ్యమానమాట. కాగా,  మాలిక్-సనా జావేద్ జంట ఈ మధ్యనే హనీమూన్‌కు కూడా వెళ్ళొచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలను మాలిక్ సతీమణి సోషల్ మీడియాలో పంచుకుంది.