దేశంలో ప్రతిపక్ష లీడర్ల గొంతు నొక్కే కుట్ర : ఉబెదుల్లా కొత్వాల్‌‌‌‌

దేశంలో ప్రతిపక్ష లీడర్ల గొంతు నొక్కే కుట్ర : ఉబెదుల్లా కొత్వాల్‌‌‌‌

బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌, వెలుగు : దేశంలో ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మైనార్టీ ఫైనాన్స్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ ఉబెదుల్లా కొత్వాల్‌‌‌‌ ఆరోపించారు. రాజ్యాంగం ప్రజాస్వామ్యం రక్షణ’ అనే అంశంపై ఆమ్‌‌‌‌ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో సెమినార్‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం లేకపోతే ప్రజల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఎన్నో కుట్రలు చేస్తోందని, నిర్బంధాలు, అక్రమ అరెస్ట్‌‌‌‌లతో గెలిచే ప్రయత్నం చేస్తోందన్నారు. 

ఈ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని మారుస్తామని కేంద్రమంత్రులు మాట్లాడుతున్నారని, కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే అంబేద్కర్‌‌‌‌ జయంతిని కూడా జరుపుకోలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని గద్దె దింపాలని, ఇందుకోసం ప్రజాస్వామ్యవాదులంతా ఏకం కావాలని సూచించారు.

 ఎలక్టోరల్‌‌‌‌ బాండ్ల వ్యవహారం బయటపడటంతో, ప్రజల దృష్టిని మరల్చేందుకే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌ చేశారన్నారు. సమావేశంలో ఆప్‌‌‌‌ రాష్ట్ర కన్వీనర్‌‌‌‌ దిడ్డి సుధాకర్‌‌‌‌, ఆర్థిక నిపుణులు పాపారావు, టీజేఎస్‌‌‌‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్‌‌‌‌, ఆప్‌‌‌‌ రాష్ట్ర కోర్‌‌‌‌ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్, డాక్టర్‌‌‌‌ అన్సారి, ఎంఎ.మజీద్, మహిళా విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హేమ జిల్లోజు, నర్సింగ్‌‌‌‌ యమున గౌడ్, అధికార ప్రతినిధులు ఫణిభూషణ్, జావేద్ షరీఫ్ పాల్గొన్నారు.