బాసర ట్రిపుల్ ఐటీలో ఇన్నోవేషన్​ హబ్​కు ప్రతిపాదనలు పంపండి

బాసర ట్రిపుల్ ఐటీలో ఇన్నోవేషన్​ హబ్​కు ప్రతిపాదనలు పంపండి

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలకు దీటుగా గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్లకు మంచి సౌలత్​లు కల్పిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నాణ్యమైన విద్య అందించడంతోనే ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదన్నారు. సర్కారు కాలేజీల్లో చదివి స్టేట్ టాపర్లుగా నిలిచిన స్టూడెంట్లను ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్​తో  కలిసి హైదరాబాద్​లో సన్మానించారు. లెక్చరర్లు చెప్పిన విషయాలు అనుసరించి.. టైం వేస్ట్​ చేయకుండా చదివితే విజేతలుగా నిలుస్తారని నిరూపితమైందని సబిత చెప్పారు. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదివాసి ఖిల్లాగా పేరున్న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా స్టూడెంట్లు మెరుగైన ఫలితాలు సాధించడం ప్రశంసనీయమన్నారు.

దేశంలో హిందీ వాడకమే ఎక్కువ.. 

ప్రపంచంలో ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడితే, ఇండియాలో హిందీ మాట్లాడుతారని సబిత అన్నారు. హిందీ దివస్​ను పురస్కరించుకుని తెలంగాణ హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో నాంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కూడా హిందీ భాషకు ఉన్న ప్రాధాన్యతను చాలా సందర్భాల్లో ప్రస్తావించారని గుర్తుచేశారు.

ఇన్నోవేషన్​ హబ్​కు ప్రతిపాదనలు పంపండి

బాసర ట్రిపుల్ ఐటీలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని అధికారులను మంత్రి సబిత ఆదేశించారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను 45 రోజుల్లో నెరవేర్చేలా చర్యలు చేపట్టాలన్నారు. గురువారం తన ఆఫీసులో ఆర్జీయూకేటీ వీసీ ప్రొ.వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్​తో కలిసి సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఇన్నోవేషన్ హబ్, ఆధునిక కంప్యూటర్లతో ల్యాబ్​ల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు పంపితే ఆమోదిస్తామన్నారు. వర్సిటీ ప్రాంగణంలో మినీ స్టేడియం ఏర్పాటుకు సంబంధించి స్థలాన్ని గుర్తించాలన్నారు. మెస్, యూనిఫామ్, షూస్​కు సంబంధించిన టెండర్లను పూర్తి చేయాలని సూచించారు.