తెలుగు చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ (chandra mohan) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు.
కుటుంబ నేపథ్యం:
చంద్రమోహన్ 1945 మే 23న కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు.. భార్య పేరు జలంధర. చంద్రమోహన్ కు చిన్నప్పటి నుండి నాటకాలపై ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే డిగ్రీ చదువు పూర్తయిన తరువాత మద్రాసు వెళ్లి సినిమాల్లో ఆకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.
సినీ జీవితం:
1966లో వచ్చిన రంగులరాట్నం సినిమాతో తొలిసారి హీరోగా వెండితెరపై కనిపించారు చంద్రమోహన్. ఆ సినిమా మంచి విజయం సాదించడంతో వరుస అవకాశాలు అందుకున్నారు. అలా సుఖదుఃఖాలు, పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి వంటి గొప్ప సినిమాల్లో నటించి తెలుగు చిత్రసీమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
హీరోయిన్లకు లక్కీ హీరో:
ఆకాలంలో చంద్రమోహన్ కు లక్కీ హీరోగా పేరుండేది. ఎందుకంటే.. ఆయన నటించిన ప్రతీ సినిమా సూపర్ హిట్ గా నిలిచేది. అంతేకాదు.. ఆయన దాదాపు అందరు సీనియర్ స్టార్ హీరోయిన్లతో నటించారు. ఆయనతో నటించిన ప్రతీ నటి ఆతరువాత స్టార్ హీరోయిన్స్ గా ఎదిగారు. వారిలో శ్రీదేవి, మంజుల, రాధిక, జయప్రద, జయసుధ, ప్రభ, విజయశాంతి వంటి వారు ఉన్నారు.
చంద్రమోహన్ తన సినీ జీవితంలో ఇప్పటివరకు మొత్తం 932 సినిమాల్లో నటించారు.. అందులో 175కు పైగా సినిమాల్లో హీరోగా నటించారు. హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు చంద్రమోహన్. అద్భుతమైన ఈ నటనా ప్రయాణంలో ఆయన అందుకున్న అవార్డులు, రివార్డులు కూడా చాలా ప్రత్యేకం. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అతనొక్కడే సినిమాకు గాను ఆయన నంది అవార్డు అందుకున్నారు. తెలుగులోనే కాదు తమిళ సినిమాల్లో కూడా నటించారు చంద్రమోహన్. ఆయన చివరగా గోపీచంద్ హీరోగా వచ్చిన ఆక్సిజన్ సినిమాలో నటించారు.
