మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్.. రామ్ చరణ్‌కు గాయం.. 'పెద్ది' షూటింగ్‌లో ఏం జరిగిందంటే?

మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్.. రామ్ చరణ్‌కు గాయం.. 'పెద్ది' షూటింగ్‌లో ఏం జరిగిందంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' (Peddi). లేటెస్ట్ గా ఈ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగినట్లు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంటి సమీపంలో గాయమయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్ లో కీలక షెడ్యూల్ జరుగుతోంది. ఈ సీన్ లో పాల్గొన్న చరణ్ కు గాయమైంది..

ఆందోళన వద్దు.. చిన్న గాయమే!

ఈ వార్త తెలియగానే మెగా అభిమానులు కంగారు పడ్డారు. అయితే, చిత్ర యూనిట్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. చరణ్‌కు తగిలింది చాలా స్వల్ప గాయమని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. వైద్యుల సూచన మేరకు ఆయన రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టి, పెండింగ్‌లో ఉన్న కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లోనే షూటింగ్ కొనసాగుతోంది.

బర్త్‌డే ట్రీట్.. టీజర్ వస్తోందా?

మార్చి 27 (శుక్రవారం) రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో, 'పెద్ది' మేకర్స్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సినిమా నుంచి ఒక పవర్‌ఫుల్ టీజర్‌ను విడుదల చేయనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండగా, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

Also Read : హైదరాబాద్‌లో వెలసిన 'కాశీ' నగరం..

స్పెషల్ సాంగ్‌లో ముగ్గురా.. నలుగురా?

'పెద్ది' చిత్రంలోని స్పెషల్ సాంగ్ గురించి ప్రస్తుతం ఫిలిం నగర్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ పాటలో ముగ్గురు లేదా నలుగురు భామలు మెరుస్తారని ప్రచారం జరిగినా, చివరకు ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. 'రంగస్థలం'లో 'జిగేల్ రాణి'గా అలరించిన పూజా హెగ్డే పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, లేటెస్ట్ సమాచారం ప్రకారం మృణాల్ ఠాకూర్ వైపే మేకర్స్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. చరణ్‌తో కలిసి మృణాల్ వేసే స్టెప్పులు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

సినిమా రిలీజ్ వాయిదా?

వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే నిజానికి ఈ చిత్రం మార్చి 27న విడుదల కావాల్సి ఉంది, కానీ నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ఏప్రిల్ 30కి వాయిదా పడింది.

అయితే, తాజా పరిస్థితులు చూస్తుంటే ఏప్రిల్ నెలాఖరున కూడా సినిమా రావడం కష్టమేనని, షూటింగ్ పనులు పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, చరణ్ కెరీర్‌లో 'పెద్ది' మరో మైలురాయిగా నిలవడం ఖాయం అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..