సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' (Varanasi) . గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా నిలిచింది. రాజమౌళి సినిమాలంటేనే అత్యంత రహస్యంగా ఉంటాయి, కానీ ఇటీవల కొన్ని అంతర్జాతీయ పత్రికలకు సెట్స్‌ను సందర్శించే అవకాశం లభించడంతో ఈ సినిమా రేంజ్ ఏంటో ప్రపంచానికి తెలిసింది. సెట్స్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్‌లో వెలసిన 'కాశీ' నగరం
వారణాసి నగరంలోని ఇరుకైన వీధులు, పురాతన ఆలయాలు,గంగా హారతి ఘాట్‌లను షూటింగ్ కోసం వాడుకోవడం దాదాపు అసాధ్యం. అందుకే రాజమౌళి తనదైన శైలిలో హైదరాబాద్ శివార్లలో ఒక భారీ వారణాసి సెట్‌ను నిర్మించారు. భారీ విస్తీర్ణంలో అసలు వారణాసిని తలపించేలా ఈ సెట్‌ను రూపొందించారు. వారణాసిలో ప్రసిద్ధి చెందిన వంగి ఉండే (Leaning Temple) రత్నేశ్వర్ ఆలయాన్ని అదే కోణంలో, అదే లోతులో అత్యంత ఖచ్చితత్వంతో ఇక్కడ పునర్నిర్మించారు.
త్రేతాయుగం నుండి 2027 వరకు..!
ఈ సినిమా కేవలం ఒక పీరియడ్ డ్రామా మాత్రమే కాదు, ఇదొక సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ అడ్వెంచర్. కథ త్రేతాయుగం నుంచి మొదలై ప్రస్తుత కాలం దాటి 2027 వరకు సాగుతుంది. కాలం మారుతున్న కొద్దీ వారణాసి నగరం ఎలా మారిందో చూపించడానికి సెట్స్‌లో వినూత్న మార్పులు చేస్తున్నారు. వాటిల్లో ఒక పురాతన కట్టడాన్ని 12 అడుగుల లోతుకు భూమిలోకి దించి, పాత కాలపు సన్నివేశాల కోసం మళ్ళీ పైకి లేపేలా హైడ్రాలిక్ సాంకేతికతను వాడుతున్నట్లు సమాచారం.
భారీ అంచనాలతో..
గతేడాది నవంబర్‌లో రామోజీ ఫిలిం సిటీలో 50 వేల మంది అభిమానుల సమక్షంలో ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతంతో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మహేష్ బాబు ఈ సినిమా కోసం తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశారు. పొడవాటి జుట్టు, గడ్డంతో ఆయన కనిపిస్తున్న తీరు చూస్తుంటే, రాజమౌళి మరో చరిత్రను సృష్టించడానికి సిద్ధమయ్యారని అర్థమవుతోంది. 'వారణాసి' కేవలం సినిమా మాత్రమే కాదు, భారతీయ సినిమా గర్వించదగ్గ మరో మైలురాయి కాబోతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
