శానిటరీ ప్యాడ్లు అడిగిన విద్యార్థినికి మహిళా ఐఏఎస్ ఎదురు ప్రశ్న

శానిటరీ ప్యాడ్లు అడిగిన విద్యార్థినికి మహిళా ఐఏఎస్ ఎదురు ప్రశ్న

పాట్నాలో ఓ ఈవెంట్ లో ఘటన

పాట్నా: శానిటరీ ప్యాడ్లను ప్రభుత్వం రూ.20–30కు ఇవ్వగలదా అని ప్రశ్నించిన ఓ విద్యార్థినికి ఓ మహిళా ఐఏఎస్ అధికారి షాకింగ్ ప్రశ్న వేశారు. ‘‘ఈరోజు మీరు (విద్యార్థినులు) రూ.20–30కు శానిటరీ ప్యాడ్లు అడుగుతున్నరు. ప్రభుత్వం జీన్స్ కూడా ఇవ్వాలని రేపు అడుగుతరు. చివరకు ఫ్యామిలీ ప్లానింగ్ కోసం కండోమ్స్ కూడా కావాలంటారేమో” అని కామెంట్​ చేశారు. బదులుగా ఆ స్టూడెంట్​ ‘ప్రజల ఓట్లతోనే ప్రభుత్వాలు ఏర్పడతయి’ అని గుర్తు చేశారు. దీంతో కోపానికొచ్చిన ఆ ఆఫీసర్  ‘‘అయితే ఓటేయకండి. పాకిస్తానీగా మారండి.

మూర్ఖత్వానికి ఇది పరాకాష్ట. డబ్బు, సేవల కోసం మీరు ఓటు వేస్తరా?” అని అన్నారు. అందుకా స్టూడెంట్ తాను ఇండియన్ అని, దేశం పాకిస్తాన్ కావాలని ఎలా కోరుకుంటానని దీటుగా స్పందించింది. ‘స్వశక్త్ బేటీ, సమృద్ధ్​ బీహార్’ పేరిట మంగళవారం పాట్నాలో నిర్వహించిన వర్క్​షాప్​లో ఈ ఘటన జరిగింది. ఇందులో మహిళ, శిశు అభివృద్ధి కార్పొరేషన్ హెడ్, ఐఏఎస్ హర్జోత్ కౌర్ భామ్రా పాల్గొని, విద్యార్థులతో మాట్లాడారు.