
- ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి ప్రశ్న
- ధరణి చూసిన కంపెనీల దగ్గర ఉన్న భూముల డేటానే.. కేటీఆర్ దగ్గర కూడా పెట్టుకున్నడు
- భూములను నిషేధిత జాబితాలో పెట్టి వారి ఫ్యామిలీలకు కేటాయించుకున్నరని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు : ధరణి పోర్టల్ నిర్వహణ చూస్తున్న కంపెనీ దగ్గర ఏవైతే భూముల రికార్డులు ఉన్నాయో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ దగ్గర కూడా అవే రికార్డులే ఉన్నాయని ధరణి కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి ఆరోపించారు. వారి కుటుంబానికి సంబంధించిన ఎంతోమందికి పలు రకాలుగా భూ బదలాయింపులు జరిగాయన్నారు. భూములను నిషేధిత జాబితాలో పెట్టి.. తర్వాత వాటిని అందుల్లోంచి తీసేసి వారి కుటుంబాలకు కేటాయించారన్నారు. తాను ఏమి గాలికి మాట్లాడటం లేదని, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కు సంబంధించి నిషేధిత భూములు ఆయన పేరు మీద పట్టా భూములుగా మారాయని ఆరోపించారు.
ఈ భూములున్న గ్రామం మొత్తం నిషేధిత జాబితాలో ఉంటే ఆయనకు మాత్రం ఎలా పట్టా చేశారని ప్రశ్నించారు. ఏకంగా 23 ఎకరాలు ఆయన పేరు మీద పట్టా అయ్యాయని చెప్పారు. గత ప్రభుత్వం సరైన కార్యాచరణ లేకుండా ధరణి తీసుకొచ్చి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని మండిపడ్డారు.
పెండింగ్ అప్లికేషన్లు క్లియర్ చేస్తున్నం..
ధరణి డ్రైవ్‌లో పెండింగ్ అప్లికేషన్లను క్లియర్ చేస్తున్నామని ధరణి కమిటీ సభ్యుడు భూమి సునీల్ తెలిపారు. ధరణి, కొత్త ఆర్‌ఓఆర్ చట్టం తీసుకొచ్చాక సీసీఎల్ఏ 2020లో ఒక సర్క్యులర్ ఇచ్చినట్లు తెలిపారు. దాని ప్రకారం అప్లికేషన్లు అప్రూవల్ చేయాలంటే జిల్లా కలెక్టర్, సీసీఏఎల్‌కు మాత్రమే అధికారం ఉందని వివరించారు. ఇప్పుడు ఆ సర్య్కులర్‌ను మారుస్తూ అధికారాల వికేంద్రీకరణ చేశారని తెలిపారు.
తహసీల్దార్ నివేదిక లేకుండా ఏ దరఖాస్తు పరిస్కారం చేయడానికి వీల్లేకుండా పెట్టారని, ఏ నిర్ణయం తీసుకున్న ఉత్తర్వులు ఉండాల్సిందేనని చెప్పారు. ధరణి మాడ్యూల్స్‌లో మార్పులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఎమ్మార్వో, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్లకు అధికారాల బదలాయింపు చేస్తున్నామని తెలిపారు. పోర్టల్‌లో శాశ్వతమైన మార్పుల దిశగా ధరణి కమిటీ పని చేస్తుందని, త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. ధరణి సమస్యలపై కొన్ని చట్టంలో, మరికొన్ని సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
పోర్టల్‌తో భారీ భూ కుంభకోణం..
ధరణి పోర్టల్ మూడు కంపెనీల చేతులు మారి.. రామలింగరాజు కుటుంబానికి చెందిన వ్యక్తికి పోర్టల్ ఇచ్చారని కోదండరెడ్డి ఆరోపించారు. ఒకవైపు రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ధరణి పోర్టల్ చూస్తుంటే.. మరోవైపు ఐటీ శాఖ పరిధిలోనూ పోర్టల్ వ్యవహారాలు నడిచాయని చెప్పారు. భూ హక్కుల విషయంలో 2014 వరకు అందరికీ సమాన న్యాయం ఉండేదని, భూ ప్రక్షాళన, ధరణి తర్వాత రైతులు భూ హక్కులను కోల్పోయారన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని ఆరోపించారు. కోటి 35 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిని చెరసాలలో పెట్టారన్నారు. ఎక్కడా జరగని విధంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో భూ కుంభకోణం తెలంగాణలో జరిగిందని ఆరోపించారు. వివిధ సమస్యలతో పార్ట్‌బీలో ఉన్న భూములు 18 లక్షల ఎకరాలు ఉన్నాయని తెలిపారు.