
- ఆయన గొంతును ఎవరో అనుకరించారు
- హైకోర్టులో లాయర్ రవిచందర్ వాదన
హైదరాబాద్, వెలుగు : గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ కింద అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని సీనియర్ లాయర్ రవిచందర్ వాదించారు. కొంత మందిని సంతృప్తిపర్చేందుకే రాజా సింగ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించారని, దీనిని రద్దుచేయాలంటూ రాజాసింగ్ భార్య ఉషాభాయ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి, జస్టిస్ జె.శ్రీదేవితో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారణ జరిపింది. తన భర్తపై పీడీ యాక్ట్ ప్రయోగించిన నేపథ్యంలో ఆయనను 12 నెలలపాటు జైల్లో ఉంచేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 90ని కొట్టేయాలని కోరుతూ ఆమె అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు. రాజాసింగ్‌పై ఉన్న కేసుల్లో కింది కోర్టు రిమాండ్‌కు పంపేందుకు నిరాకరించిందని, ఈ పరిస్థితుల్లో కావాలని ఆయనపై తప్పుడు ఆరోపణలు చేసి పీడీ యాక్ట్ ప్రయోగించారని రవిచందర్ వాదించారు. గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా పీడీ యాక్ట్‌ను రాజాసింగ్‌పై ప్రయోగించారని తెలిపారు. మహ్మద్ ప్రవక్తను చెడుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో రాజా సింగ్ పోస్టింగ్స్ పెట్టారనే అభియోగాలకు ఆధారమైన ట్రాన్స్‌లేషన్ చేసిన వ్యక్తి ఎవరో పేర్కొనలేదన్నారు. ఆ వీడియోలో ఉన్నది రాజా సింగ్ వాయిస్ కాదని, వేరే ఎవరో ఆయన వాయిస్‌ను అనుకరించారని చెప్పారు. ప్రవక్తను రాజా సింగ్ ‘అకా’ అనే పదంతో ఉచ్చరించారన్న పోలీసుల అభియోగాల్లో వాస్తవం లేదన్నారు. ప్రవక్త గురించి రాజాసింగ్ తప్పుగా మాట్లాడినట్లుగా వీడియోలను సోషల్ మీడియాలో పెట్టారన్నారు. ప్రవక్త గురించి ఆయన ఏమీ మాట్లాడలేదన్నారు. ఆయనపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి పోలీసులు చూపుతున్న 15 కేసుల్లో ఆధారాలు లేవన్నారు. 50 ఏళ్ల వ్యక్తి ఆరేళ్ల బాలికను వివాహం చేసుకోవడం గురించి రాజా సింగ్ ఆగస్టు 22న మాట్లాడారని, ఆయనపై నమోదు చేసిన పీడీ యాక్ట్‌ను రద్దు చేయాలని కోరారు. మంగళవారానికి విచారణ వాయిదా పడింది.