రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం 

రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం 

రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని ఆ పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలామంది బలిదానమయ్యారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ టీఆర్ఎస్ కుటుంబ పార్టీ చేతిలో ఖైదు చేశారని, దాన్ని విముక్తి చేసే పార్టీ ఒక బీజేపీ మాత్రమేనని అన్నారు. ‘కేసీఆర్ ను హెచ్చరిస్తున్నా. సమయం అయిపోయింది. ప్రజలిచ్చిన తీర్పును అవమానించావు. ఇక సింహాసనం ఖాళీ చేయండి. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలే టీఆర్ఎస్ ను ఖాళీ చేయిస్తారు’ అని మురళీధర్ రావు కామెంట్స్ చేశారు. 

ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదన్న మురళీధర్ రావు..తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేసీఆర్ సర్కార్ విస్మరించిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితబంధు పథకం ఫెయిలైందని, హైదరాబాద్ లో వరద సాయం చేయడంలోనూ హామీని విస్మరించిందన్నారు. దేశంలో ఏ పార్టీ చూసినా కుటుంబ పార్టీలేనని, ఒక బీజేపీ మాత్రం ఆ తరహా పార్టీ కాదని అన్నారు. కుటుంబ రాజకీయాలకు లొంగని పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ల పరిపాలనలో ఎక్కడా అవినీతి లేదన్నారు. ‘కుటుంబ రాజకీయాలు లేవు. కులతత్వం లేదు. అన్ని వర్గాలకు అతీతంగా పరిపాలన కొనసాగుతోంది’ అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో  నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మోడీ నాయకత్వంలో ఎన్ డీఏ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో అణిచివేసిందన్నారు. రక్షణరంగ వ్యవస్థలోనూ ఇతర దేశాలతో పోటీ పడుతూ.. అమెరికా, చైనా వంటి దేశాలతో సమానంగా మాట్లాడగలిగే స్థాయికి వచ్చామన్నారు.