కాంగ్రెస్‌లో పోటాపోటీ పాదయాత్రలు

కాంగ్రెస్‌లో  పోటాపోటీ  పాదయాత్రలు
  • ఇప్పటికే షురూ చేసిన రేవంత్‌ రెడ్డి
  • నేడు ‘రైతులతో ముఖాముఖి’ పేరుతో భట్టి టూర్
  • రేపు సదాశివపేట నుంచి ప్రగతి భవన్​కు జగ్గారెడ్డి
  • ఏఐసీసీ సర్క్యులర్‌ మేరకే యాత్రలంటున్న లీడర్లు

హైదరాబాద్‌, వెలుగు:కాంగ్రెస్‌లో పాదయాత్రల సీజన్ నడుస్తోంది. సీనియర్ నేతలు పోటాపోటీగా యాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డి పాదయాత్ర షురూ చేయగా, మంగళవారం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, బుధవారం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా మొదలుపెట్టనున్నారు. ఇలా ఒక్కో నేత ఉన్నట్టుండి యాత్రలు మొదలుపెట్టడం కాంగ్రెస్‌లో ఆసక్తికరంగా మారింది. రైతుల విషయంలో ఏఐసీసీ పిలుపు మేరకు ధర్నాలు, నిరసనల్లాంటి రెండు, మూడు గంటల ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లు చేసిన లీడర్లు.. రోజుల తరబడి యాత్రలు చేపట్టడంతో క్యాడర్‌‌‌‌‌‌‌‌ ఓ వైపు సంతోషంగానే ఉన్నా, మరోవైపు ఎందుకింత హడావిడిగా, పోటాపోటీగా యాత్రలు చేస్తున్నారని చర్చించుకుంటున్నారు.

ఎప్పటినుంచో చెబుతున్న లీడర్లు

పాదయాత్రలు చేయాలనే క్రేజ్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లలో చాలా కాలంగా ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా తాము యాత్రలు చేస్తామని మీడియాతో చెబుతున్నారు. భట్టి, రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, జగ్గారెడ్డిలతో పాటు ఎంపీ కోమటిరెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్ తదితర నేతలు కూడా పలు సందర్భాల్లో పాదయాత్ర చేస్తామని చెప్పుకొచ్చారు. యాత్రలతో జనం నుంచి మంచి రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌ వస్తుందని వాళ్లు భావిస్తున్నారు.

రైతుల సమస్యలపై భట్టి..

అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే ప్రతిపక్ష నేతగా, సీఎల్పీ లీడర్‌‌‌‌‌‌‌‌గా ప్రజా సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో యాత్రలు చేపడతానని భట్టి విక్రమార్క చెప్పారు. గతంలో రాష్ట్రంలోని హాస్పిటళ్ల పరిస్థితిపై ఆయన యాత్ర చేశారు. కరోనా ఏర్పాట్లపై పర్యటించారు. తాజాగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు ‘రైతులతో ముఖాముఖి’ కార్యక్రమం ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. పది రోజుల క్రితమే దీనికి సంబంధించిన షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి 21వ తేదీ వరకు పర్యటన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా భీంసార్‌‌‌‌‌‌‌‌ గ్రామం నుంచి పాత ఖమ్మం జిల్లా మధిర వరకు యాత్ర నిర్వహించి రైతుల కష్ట సుఖాలను తెలుసుకోవాలని నిర్ణయించారు. 11 కొత్త జిల్లాల మీదుగా ఆయన యాత్ర సాగుతుంది.

రేవంత్ ఉన్నట్టుండి..

భట్టి యాత్రకు రెండు రోజుల ముందే ఆదివారం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అనూహ్యమైన రీతిలో పాదయాత్ర మొదలుపెట్టారు. అచ్చంపేటలో ‘రాజీవ్‌‌‌‌‌‌‌‌ రైతు భరోసా దీక్ష’ పేరిట ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన.. తర్వాత దాన్ని పాదయాత్రగా మార్చారు. సభలో పాల్గొన్న జనం, స్టేజీపై ఉన్న లీడర్ల కోరిక మేరకు ఆయన అప్పటికప్పుడు టూర్ మొదలుపెట్టారు. తొలిరోజు తొమ్మిది కిలోమీటర్లు, రెండో రోజైన సోమవారం 11 కిలోమీటర్లు నడిచారు. 8 రోజుల పాటు సాగే యాత్ర చివరగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ చేరుకోనుంది.

ప్రగతిభవన్​కు జగ్గారెడ్డి..

రైతుల కోసం పాదయాత్ర చేస్తానని చాలా రోజులుగా అంటున్న జగ్గారెడ్డి తాను 10వ తేదీన ముహూర్తం పెట్టుకున్నారు. పర్మిషన్‌‌‌‌‌‌‌‌ కోసం పోలీసులకు లెటర్‌‌‌‌‌‌‌‌ పెట్టారు. సదాశివపేట నుంచి సంగారెడ్డి, పటాన్‌‌‌‌‌‌‌‌చెరు, గచ్చిబౌలి, పంజాగుట్టల మీదుగా ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌ వచ్చేందుకు ఆయన ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. వీరే కాకుండా మరికొంతమంది నేతలు కూడా పాదయాత్రలకు రెడీగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఢిల్లీకి ఉత్తమ్

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఏదైనా యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాడర్‌‌‌‌‌‌‌‌ భావించింది. కానీ ఆయన సోమవారం మధ్యాహ్నమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లిపోయారు. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ సమావేశాలు హాజరయ్యేందుకు ఆయన వెళ్లినట్లు గాంధీభవన్‌‌‌‌‌‌‌‌ వర్గాలు తెలిపాయి.

పర్మిషన్‌ తీసుకున్నరా?

కాంగ్రెస్‌లో లీడర్లు తమ నియోజకవర్గాలు దాటి పాదయాత్రలు చేపట్టాలంటే పీసీసీ పర్మిషన్‌ తీసుకోవాలి. రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ ఆమోదం కూడా ఉండాలి. సీఎల్పీ నేతగా భట్టి.. రాష్ట్రంలో పర్యటించవచ్చు. ఆయన తన యాత్రకు ఆమోదం పొందారు. రేవంత్‌, జగ్గారెడ్డి పర్మిషన్‌ తీసుకోలేదని తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్ మాణిక్కం ఠాగూర్‌ని కొందరు సీనియర్‌ లీడర్లు రేవంత్‌ పాదయాత్ర గురించి అడిగారు. దీంతో ఆయన ‘నాకు తెలియదు’ అని చెప్పినట్లు సమాచారం. ఇదే విషయమై జగ్గారెడ్డిని ప్రశ్నించగా.. ఏఐసీసీ నుంచి తమకు ఒక సర్క్యులర్‌ వచ్చిందని, లీడర్లందరూ తమ తమ ప్రాంతాల్లో రైతుల కోసం వివిధ యాక్టివిటీలు చేపట్టమని సూచించారని తెలిపారు. ఈ సూచనల మేరకే తామంతా యాత్రలు చేపడుతున్నామన్నారు.