Jr NTR: తెలుగువారి గుండె తల్లడిల్లిపోతోంది.. తాతపై తారక్ ఎమోషనల్

Jr NTR: తెలుగువారి గుండె తల్లడిల్లిపోతోంది.. తాతపై తారక్ ఎమోషనల్

ఇవాళ గురువారం (మే28, 2026న) నందమూరి తారకరామారావు 103వ జయంతి. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ తన తాతకు ఘనంగా నివాళులు అర్పించారు. అక్కడే కొద్దిసేపు మౌనంగా కూర్చుని తాత ఎన్టీఆర్ జ్ఞాపకాలను తారక్ స్మరించుకున్నారు. చూడటానికి వచ్చిన అభిమానులకు అభివాదం చేసి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అనంతరం సోషల్ మీడియా వేదికగా తారక్ భావోద్వేగ పోస్టు చేశారు. “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను” అంటూ తన తాతపై ఉన్న అపారమైన ప్రేమ, గౌరవాన్ని వ్యక్తం చేశారు.

ఇదే సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు కూడా ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ సినీ పురస్కారాల్లో భాగంగా ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్న చిరంజీవి కూడా ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు.

చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం:

తెలంగాణ ప్రభుత్వం 2026 మార్చిలో ఉగాది సందర్భంగా ప్రకటించిన గద్దర్‌ సినీ పురస్కారాల్లో భాగంగా, మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా నేడు సీనియర్ ఎన్టీఆర్కి చిరంజీవి ఘన నివాళులు అర్పించారు.

“ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో చెరిగిపోదు. తెరపై అనేక పాత్రలను సజీవంగా ఆవిష్కరించిన మహానటుడిగా, ప్రజాజీవితంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన శ్రీ నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులు. ఇటీవల నాకు లభించిన ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఎంతో ప్రత్యేకమైన గౌరవం” అంటూ చిరంజీవి భావోద్వేగంగా పేర్కొన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ సినీ, రాజకీయ ప్రస్థానం ఓ అధ్యాయం. సుమారు తన 35 సంవత్సరాల సినీ జీవితం తరతరాలకు ఆదర్శం. 18 చారిత్రకాలు.. 17 సాంఘిక చిత్రాలు.. 32 సాంఘిక నాట్యాలు.. 18 పౌరాణికం.. 95 మంది దర్శకులు.. ఎన్నో అద్భుత పాత్రలు పోషించి కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. అనంతరం రాజకీయాల్లో ప్రవేశించి తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి మూడు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు.