- ఈ నెలాఖర్లో రిటైరవనున్న ఎస్కే జోషి
- అజయ్ మిశ్రా, సోమేశ్ కుమార్ మధ్య పోటీ!
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఈ నెలాఖర్లో రిటైర్ అవుతున్నారు. తొలుత జోషి పదవీకాలాన్ని పొడిగిస్తారా, లేక కొత్త సీఎస్‌ను నియమిస్తారా అన్నదానిపై కొంత సందిగ్ధత నెలకొంది. కానీ జోషి పదవీకాలాన్ని పొడిగించే పరిస్థితులు కనబడటం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దాంతో కొత్త సీఎస్ ఎవరనేదానిపై చర్చ మొదలైంది. ఉన్నవారిలో సీనియర్లు బీపీ ఆచార్య, బినోయ్ కుమార్ లకు సీఎస్ పదవి దక్కే అవకాశం తక్కువని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్న బినోయ్ కుమార్ రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖంగా లేరని అధికారులు చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో తర్వాతి సీనియర్ ఐఏఎస్ అజయ్ మిశ్రా సీఎస్ పోటీలో ఉన్నారు. అయితే వచ్చే ఏడాది జులై నాటికి ఆయన రిటైర్ కానున్నారు. ఈ ఏడు నెలల కోసం ఆయనకు సీఎస్ గా చాన్స్ ఇస్తారా, లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ అజయ్ మిశ్రా కాకుంటే సోమేశ్ కుమార్ కు పదవి దక్కే చాన్స్ ఉందని అంటున్నారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌కుమార్‌ను ఏపీ కేడర్ కు కేటాయించారు. దానిపై ఆయన కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుని, ఇక్కడే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన సీఎస్ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం ఉంది. గతంలో ఒక రాష్ట్ర కేడర్ ఐఏఎస్ లు మరో రాష్ట్రానికి సీఎస్ లుగా పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని, ఆ లెక్కన సోమేశ్‌ను ఏపీ కేడర్ కింద పరిగణించినా ఇక్కడ సీఎస్ పదవి చేపట్టేందుకు ఇబ్బంది ఉండదని అధికార వర్గాలు చెప్తున్నాయి.ఏపీ కేడర్ కు చెందిన శంకరన్ కేరళ రాష్ట్రానికి సీఎస్ గా పనిచేశారని గుర్తు చేస్తున్నాయి.

