సీనియర్లు వర్సెస్​ సిట్టింగులు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నడుమ హోరాహోరీ

సీనియర్లు వర్సెస్​ సిట్టింగులు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నడుమ హోరాహోరీ
  • 12 స్థానాల్లోనూ కాంగ్రెస్ నుంచి  బలమైన అభ్యర్థులు
  • సిట్టింగ్ స్థానాలు కాపాడుకునేందుకు చెమటోడుస్తున్న ఎమ్మెల్యేలు
  • ఒకప్పటి కాంగ్రెస్​ కంచుకోటపై సర్వత్రా ఆసక్తి

నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్​ సీనియర్​ లీడర్లు, సిట్టింగ్​ఎమ్మెల్యేల  నడుమ హోరాహోరీ పోరు జరుగుతోంది. 12 స్థానాల్లోనూ కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థులు బరిలో దిగడంతో రూలింగ్​ పార్టీ ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది.  ఇన్నాళ్లూ సంక్షేమం, అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకున్న ఎమ్మెల్యేలు ప్రస్తుతం సిట్టింగ్​ స్థానాలు కాపాడుకునేందుకు చెమటోడుస్తున్నారు. ఒక వైపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్​ హవా వీస్తుండడం, ఇటు తమ పార్టీ  క్యాడర్​ చేజారుతుండడం, మరోవైపు ప్రజావ్యతిరేకత గులాబీ అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

టికెట్ల కేటాయింపులో సీనియర్లు సక్సెస్​

అనుకున్న వాళ్లకు టికెట్లు కేటాయించుకోవడంలో కాంగ్రెస్​ సీనియర్లు సక్సెస్​ అయ్యారు. ఇందుకోసం పకడ్బందీ వ్యూహం అమలు చేశారు. పార్టీ సర్వేల ప్రకారం గెలుపు గుర్రాలనే అభ్యర్థులుగా ఖరారు చేసేలా హైకమాండ్​ను మెప్పించడంలో సక్సెస్​ అయ్యారు. నామినేషన్ల గడువు ముగిసే చివరి రోజు వరకు పెండింగ్​లో పెట్టిన తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ స్థానాల్లోనూ సీనియర్ల మాటే చెల్లుబాటు అయింది. కమ్యూనిస్టులతో పొత్తు లేకుండానే అన్ని సీట్లు గెలుస్తామని ముందు నుంచి ధీమా వ్యక్తం చేసిన సీనియర్లు చివరకు సీపీఐతో మైత్రికి అంగీకరించారు.  కానీ, పొత్తుల ప్రభావం ఉమ్మడి జిల్లాపై పడకుండా జాగ్రత్త పడ్డారు. సీపీఎంతో పొత్తు కుదిరితే మిర్యాలగూడ సీటు వదలుకోవాల్సి వస్తదని భావించిన సీనియర్లు అక్కడ కూడా రాజకీయ చతురత ప్రదర్శించారు.  సీపీఎంతో పొత్తు వల్ల గెలిచే సీటు చేజారిపోతుందని భావించిన ఎంపీలు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైకమాండ్​పై  ఒత్తిడి పెంచారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్​ రెడ్డి విషయంలో కూడా ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి చివరి వరకు పట్టువదల్లేదు. స్థానికులకే టికెట్​ ఇస్తే తప్ప తుంగతుర్తిలో గెలుపు సాధ్యం కాదని  హైకమాండ్​కు తేల్చిచెప్పిన కోమటి రెడ్డి బ్రదర్స్..​ తెలంగాణ ఉద్యమ నేత మందుల  సామ్యూల్​ను తెరపైకి తీ సుకొచ్చారు.

బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు...

కాంగ్రెస్​ పార్టీకి చాలాచోట్ల అసలు అభ్యర్థులే లేరని, సీట్లు అమ్ముకుంటున్నారని మొదట్లో ఆరోపణలు చేసిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా సైలెంట్​ అయ్యారు. కాంగ్రెస్​ మొదటి జాబితా ప్రకటించిన కొద్దిరోజులకే సీనియర్లు పోటీ చేస్తున్న నల్గొండ, నాగార్జునసాగర్​, హుజూర్​నగర్​, కోదాడ నియోజక వర్గాల్లో బీఆర్​ఎస్​లో అసమ్మతి భగ్గుమంది. పార్టీకి చెందిన కీలక నేతలు కాంగ్రెస్​లో చేరడం మరింత కలవరపాటుకు గురిచేసింది. రెండో జాబితాలో కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి రీ ఎంట్రీ ఇవ్వడంతో మునుగోడులో బీఆర్ఎస్​కు గట్టిషాక్​ తగిలింది. నియోజకవర్గంలో కీలక ప్రజాప్రతినిధులు మూకు మ్మడిగా రాజీనామా చేసి పార్టీలో చేరడంతో బీఆర్ఎస్​ హైకమాండ్​ కంగుతిన్నది. దేవరకొండలో బాలు నాయక్​ అభ్యర్థిగా డిసైడ్​ అవడంతో అక్కడ మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి వర్గం గంపగుత్తగా కాంగ్రెస్​లో చేరిపోయింది. సూర్యాపేట, నల్గొండ, హుజూర్​నగర్​, కోదాడ, నకిరేకల్​, నాగార్జునసాగర్, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో బీఆర్​ఎస్​లో భారీ చీలిక వచ్చింది. తెలంగాణ ఉద్యమకారులమని సీఎం కేసీఆర్ పైన తిరగబడ్డ చెరుకు సుధాకర్​, జిట్టా బాలకృష్ణారెడ్డి, చాడ కిషన్​రెడ్డి, చకిలం అనిల్​ కుమార్​ వంటి నాయకులు బీఆర్ఎస్​లో చేరినా ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. దీంతో చేజారిపోయిన నేతలను రప్పించేందుకు చివరి దశలో బీఆర్ఎస్​ హైకమాండ్​ సామ,దాన, భేద, దండోపాయాలు ప్రయోగించినప్పటికీ లాభం లేకుండా పోయింది.

ఎత్తుకు పై ఎత్తులు..

2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్​ సీనియర్లు పదునైన ఎన్నికల వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. 2018లో బీఆర్​ఎస్​ కోదాడ, నల్గొండ నియోజవర్గాల్లో కొత్త వాళ్లను రంగంలోకి దింపితే.. ఈసారి కాంగ్రెస్​ ఏకంగా ఐదు చోట్ల కొత్త అభ్యర్థులను బరిలో దింపింది. హుజూర్​నగర్​లో ఉత్తమ్​ రాజీనామాతో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి బైపోల్​లో అవకాశం లభిస్తే.. నాగార్జునసాగర్​లో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణించడంతో ఆయన కొడుకు భగత్​కు ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్​ దక్కింది. నకిరేకల్​ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ మారడంతో బీఆర్​ఎస్​ బలం పెరిగిందని సంబరపడ్డారు. గతేడాది చివర్లో మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపుతో ఉమ్మడి జిల్లాలో తమకు ఎదురులేదని బీఆర్​ఎస్ హైకమాండ్​ ధీమా వ్యక్తం చేసింది. కానీ, ప్రస్తుతం బీఆర్ఎస్​లో మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన స్థానాల్లోనే ఆ పార్టీకి ఎదురీత తప్పట్లేదు. మునుగోడులో మాజీ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి తిరిగి పార్టీలోకి రావడం ఒక ఎత్తయితే, నకిరేకల్​ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్​లో చేరడంతో ఈ రెండు చోట్లా కాంగ్రెస్​ బలం పెరిగింది. మిర్యాలగూడ సీటును గత ఎన్నికల్లో బీసీ నేత ఆర్​ కృష్ణయ్యకు ఇవ్వడం వల్ల పార్టీకి తీరని నష్టం జరిగిందని గ్రహించిన సీనియర్లు ఈసారి స్థానికుడైన బత్తుల లక్ష్మారెడ్డిని రంగంలోకి దింపారు.  సూర్యాపేటలో మంత్రి జగదీశ్​ రెడ్డితో సహా ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి ఎమ్మెల్యేలు మూడోసారి హ్యాట్రిక్​ కొడ్తామనే ధీమాతో ఇన్నాళ్లూ ఉన్నారు. కానీ, కాంగ్రెస్ ఆలేరులో కురుమ సామాజికవర్గానికి చెందిన బీర్ల అయిలయ్యను, భువనగిరిలో కుంభం అనిల్​ కుమార్ రెడ్డిని దింపడంతో ఆ పార్టీలో జోష్​ పెరిగింది. తుంగతుర్తి టికెట్​ ఆశించిన అద్దంకి దయాకర్, కొండేటి మల్లయ్య, మోత్కుపల్లి నర్సింహులను సైతం పక్కన పెట్టి.. స్థానికుడైన మందుల సామ్యూల్​కు ఇవ్వడం ద్వారా నాన్​లోకల్ ​అయిన ఎమ్మెల్యే గాదరి కిషోర్​ కుమార్​కు చెక్​ పెట్టవచ్చని కాంగ్రెస్​ పెద్దలు పక్కా స్కెచ్​ వేశారు. పైగా మాదిగ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు తుంగతుర్తిలో ఎక్కువగా ఉండడంతో అదే వర్గానికి చెందిన సామ్యూల్​కు టికెట్​ఇవ్వడం వెనుక పక్కాప్లాన్​ ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ALSO READ: కోరుట్లలో వారసుల వార్

కొత్తగా ఐదుగురిని బరిలో దింపిన కాంగ్రెస్​..

2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్​ తరపున మొదటిసారి ఐదుగురు అభ్యర్థులు రంగంలోకి దిగారు. నకిరేకల్​లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఆలేరులో బీర్ల అయిలయ్య, నాగార్జునసాగర్​లో జానారెడ్డి కొడుకు జయవీర్​ రెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, తుంగతుర్తిలో మందుల సామ్యూల్​ పోటీలో ఉన్నారు. వీళ్లలో తుంగతుర్తి, ఆలేరు, నాగార్జునసాగర్​, మిర్యాలగూడ అభ్యర్థులు నలుగురూ తొలిసారి పోటీలో దిగినవారే. కానీ వీళ్లందరికీ సీనియర్లు వెన్నుదన్నుగా ఉన్నారు.